జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం  | TDP Leaders Zilla Parishad Land Mafia Prakasam | Sakshi
Sakshi News home page

జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం 

Published Sun, Apr 28 2019 10:33 AM | Last Updated on Sun, Apr 28 2019 10:33 AM

TDP Leaders Zilla Parishad Land Mafia Prakasam - Sakshi

జెడ్పీ పరిపాలనా భవనం నిర్మాణానికి ఫౌండేషన్‌ వేసి వదిలేసిన ప్రాంతం

ఒంగోలు సిటీ: సొంత స్థలమైతే కంచె వేస్తాం.. కట్టడి చేసుకుంటాం. అన్యుల పాలు కాకుండా కాపాడుకుంటాం. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు జాగ్రత్తగా దాచుకుంటాం. పశువులు రాకుండా, వర్షం, మురుగు నీళ్లు నిలవకుండా మెరకలు పోస్తాం. ప్రతి ఒక్క యజమాని తన ఆస్తిని సంరక్షించుకొనే పద్దతి ఇదే. జిల్లా పరిషత్‌ విషయానికొస్తే అందుబాటులో ఉన్న ఆస్తులను నిర్వహించుకోవడంలో నిర్లక్ష్యం. విలువైన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు లేవు. కనీసం గుర్తించే పనిలోనూ లేరు.

ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు భద్రపరిచిన దాఖలాలు లేవు. జెడ్పీకి ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయి.. వాటి విలువ ఇతర వివరాలను అడిగి చూడండి.. మాకు తెలియదనే జవాబు వస్తుంది. ఇది జెడ్పీలో ఆవరించిన నిర్లక్ష్యానికి నిదర్శనం. జిల్లాలో స్థానిక సంస్థలకు విలువైన ఆస్తులు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కొన్నింటికే వివరాలు ఉన్నాయి. మూడొంతుల స్థలాలు ఎవరి కబ్జాలో ఉన్నాయో తెలియవు. భూమి స్వరూపం ఏ విధంగా మారిపోతుందో తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు భూమి విలువ బాగా పెరిగింది. ఒకప్పుడు ఎకరా రూ.లక్షలోపు విలువ ఉంటే ఇప్పుడు అదే ఎకరా రూ.2 కోట్లు పలుకుతోంది.
 
జిల్లా పరిషత్తుకు సంబంధించి 17 ఎకరాల భూమి ఒంగోలు శివారు మంగమూరు సర్వే నంబర్‌లో ఉంది. దీనిలో ఇప్పుడు సుబాబుల్, జామాయిల్‌ తోట వేసి ఉంది. ఇప్పుడు జెడ్పీ నిర్వహణలో ఉందని చెబుతున్నా.. వాస్తవానికి ఓ పలుకుబడి ఉన్న వ్యక్తి దీనిని ఆ«ధీనంలో ఉంచుకున్నారు. ఒకప్పుడు అంతగా కన్ను లేకపోవడంతో సదరు వ్యక్తి తోట పెంచుకుంటూ ఈ భూమి తనదే అన్పించుకున్నారు. ఎకరా విలువ రూ.2 కోట్లకు చేరడంతో ఎన్జీవోలు తమకు ఇంటి నివేశన స్థలానికి పట్టా ఇవ్వమని, కొందరు మార్కెట్‌ విలువ ప్రకారం అమ్మమని, మరి కొందరు నిరు పేదలకు ఇంటి నివేశన స్థలాలను ఇవ్వమని, తాజాగా జెడ్పీ ఉద్యోగులు తమదే ఈ స్థలం కావడంతో తమకు ఇళ్ల కోసం కేటాయించమని రకరకాలుగా ఒత్తిళ్లు నెలకున్నాయి. ఇందరి కన్ను ఉండటంతో దీని జోలికి వెళ్లాలంటే తేనె తుట్టెను కదిలించినట్లేనని మిన్నకుండి పోయారు. కొందరు క్రయ విక్రయాలు జరిగాయని ఒప్పంద పత్రాలతో లిటిగేషన్లకు పూనుకున్నారు.

తాగునీటి కోసమే..
ఇంత విలువైన ఆస్తిని ఎవ్వరికీ ఇవ్వబోమని అప్పటి జిల్లా సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీనసింహం దీనిపై ప్రత్యేకంగా నివేదిక తయారు చేశారు. ఒంగోలు ప్రజలకు తాగు నీటికి ఇప్పుడున్న వేసవి చెరువులు రెండిటిలోనూ నీటి నిల్వ సామర్థ్యం సరిపోవడం లేదని తన నివేదికలో పేర్కొని తాగునీటి కోసమే ఈ 17 ఎకరాలను ఉపయోగిస్తామని స్వాధీనంలోకి తీసుకోమని రెవెన్యూ అధికారులకు సూచన చేస్తూ ఆర్డీవోను భూమిని స్వాధీనంలోకి తీసుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. ఆయన ఇన్‌ఛార్జి జెడ్పీ సీఈవోగా బాధ్యతలను నిర్వహించినప్పుడు స్వాధీనం కోసం తయారు చేసిన నివేదికను గల్లంతు చేశారు. ఇప్పుడు సంబంధిత రికార్డు ఏమైందో కూడా తెలియని పరిస్థితి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ భూమి పరి స్థితి ఇలా ఉంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆస్తుల పరిస్థితి.. వాటి అన్యాక్రాంతం వివరాలు ఎక్కడున్నాయన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది.

కబ్జా వెయ్యి ఎకరాల పై మాటే..
పొన్నలూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల భూమిని కొందరు ఆక్రమించారు. ఇదేమి చోద్యం హైస్కూలు.. అందులోనూ నిరుపేద పిల్లలకు చదువు చెప్పే కోవెల. అలాంటి స్థలాన్ని ఎలా కబ్జా చేస్తారని అడిగిన వారు లేరు. కొందరు ప్రజా ప్రతినిధులు కబ్జా చేసిన వారికే వత్తాసు పలికారు. ఇంకేం వారికే భూమిని బదలాయించి ఇంటి నివేశన స్థలాలు ఇచ్చారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి.

జెడ్పీ పరిధిలో సుమారు మూడు వేల ఎకరాలు ఉన్నాయి. ఇందులో జెడ్పీ కార్యాలయాలు ఉన్నాయి. దుకాణాల సముదాయాలు ఉన్నాయి. అతిథి గహాలు నిర్మించారు. విడిది కేంద్రాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలాలు ఉన్నాయి. వీటి విలువ ఇప్పుడు లెక్క గడితే రూ.30 వేల కోట్లే అంటున్నారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌ రోడ్డు కూడలిలో జిల్లా పరిషత్తు స్థలం ఉంది. ఇక్కడ కార్యాలయాన్ని నిర్మించాలని శంకుస్థాపన చేశారు. ఇందు కోసం రూ.2 కోట్లు ఎంఎన్‌పి గ్రాంటు నుంచి నిధులు కేటాయించారు. ఖాళీగానే ఉంచేశారు. నిధులు వెనక్కి పోయాయి. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని కొందరు కన్నెశారు. కల్యాణ మండపానికి లీజు కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతల వద్ద కల్యాణ మండపానికి మంతనాలు కూడా జరిగాయి.

మండల పరిషత్‌లు పరిధిలో సుమారు 1300 ఎకరాలు భూములు ఉన్నాయి. జెడ్పీ హైస్కూలు స్థలాలు సుమారు 1200 ఎకరాలు ఉన్నాయి. వీటి విలువ లెక్క కట్టలేనిది. జెడ్పీ హైసూళ్ల స్థలాల చుట్టూ జెడ్పీ ఛైర్మన్‌ ఈదర హరిబాబు సూళ్లకు ప్రహరీలను నిర్మించారు. స్కూళ్ల స్థలాలను కట్టడి చేశారు. ఇక అన్యాక్రాంతం కావడానికి వీల్లేకుండా ఫెన్సింగ్‌ వేశారు. పొన్నలూరు తరహాలోనే 250 ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్లుగా లెక్కలున్నాయి. అయి తే స్థానిక రాజకీయ నాయకులను కాదని ఎవ్వరు పట్టించుకోగలరంటున్నారు. విలువైన మండల పరిషత్తు, హైస్కూలు స్థలాలు అన్యులపరమై ఉన్నాయి.

నిర్వహణ అంతం మాత్రమే..
జిల్లాలోని కొత్తపట్నం, ఒంగోలు, మార్కాపురం, సీఎస్‌పురం, కందుకూరు ఇలా పలు చోట్ల అతిథి గృహాలు, దుకాణ సముదాయాలు ఉన్నాయి. గిద్దలూరు, మార్టూరు, ఒంగోలులో దుకాణాలు ఉన్నాయి. వీటిని నిర్వహించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన స్థలాలు, ఆస్తులు దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదు. నిధులు లేవంటూనే నెట్టుకొస్తున్నారు. నిర్వహణలేక, ఆలనా పాలన లేక విలువైన ఆస్తులు దెబ్బతినిపోతున్నాయి.

రికార్డులు గల్లంతు..
విలువైన జెడ్పీ ఆస్తులకు సంబంధించిన కాగితం ముక్క కార్యాలయంలో అందుబాటులో లేదు. ఏ వివరాలు అడిగినా దిక్కు దివాణా లేదు. అసలు రికార్డు నిర్వహించుకోవడానికి ప్రత్యేకించి విభాగం లేకపోవడం గమనార్హం. మండలాల్లోనూ అదే పరిస్ధితి నెలకుంది. జేసీ లక్ష్మీ నసింహం ఉన్నప్పుడు కొంత సమాచారాన్ని సేకరించారు. దానిని కూడా ఎక్కడుంచారన్నది వివరాలు లేవు. రెవెన్యూ శాఖకు కాంతిలాల్‌ దండే జెడ్పీ ప్రత్యేకాధికారిగా ఉన్నప్పుడు ఆస్తుల వివరాలు తేల్చమని ఆదేశించారు. ఆయన ఆదేశాలు భేఖాతరయ్యాయి. రెవెన్యూలో లెక్క చేసిన వారు లేరు.  కొంత రికార్డు ఉన్నా దానిని బయట  పెడితేనే రూ.వందల కోట్లు విలువైన ఆస్తులు బయటకొస్తాయి. అందుకే వీటిపై విచారణలు లేవు. సుమారు వెయ్యి ఎకరాలు స్థలాలు అన్యులపాలయినట్లుగా గుర్తించారు. ఇంకా లెక్కలేనన్ని ఆస్తులు ఉంటాయన్నది అంచనా. వీటి విలువ సుమారు ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.700 కోట్లకుపైమాటే. రికార్డులను తయారు చేద్దామన్న ధ్యాసలేదు.

చేతులు దులుపుకుంటున్న పాలకులు..
ఇటీవల వెబ్‌ పోర్టింగ్‌ చేసినప్పుడు కొన్ని వివరాలు ఆర్‌ఎస్‌ఆర్‌ దాఖలా బయట పడ్డాయి. దాతలు జెడ్పీకి కొన్ని ఆస్తులను భూరి విరాళాలుగా ఇచ్చారు. అలాంటివి బయటకు రాలేదు. దాతలు ఇచ్చిన ఆస్తులు పరుల పాలయ్యాయి. వీటిలో మూడొంతులు ఆస్తులకు సరైన రికార్డులు లేవు. ఉన్న రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రికార్డులను గల్లంతు చేశారు. వీటిపై పాలకులు శ్రద్ద వహిస్తే విలువైన ఆస్తుల వివరాలు బయటకు వస్తాయి. పాలకులు వస్తున్నారు.. పోతున్నారు.. చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ పాలక వర్గానికి గడువు ఇక నెలన్నర మాత్రమే ఉండడం గమనార్హం. జెడ్పీ విలువైన ఆస్తులపై దృష్టి సారిస్తారన్న విశ్వాసం ప్రజల్లో నెలకోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement