సాక్షి,విశాఖపట్నం: దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ అవార్డులను ఆతిథ్య ఏపీ సొంతం చేసుకుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ నైపుణ్య పోటీలు ఘనంగా ముగిశాయి. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరై విజేతలందరికీ అవార్డులను ప్రదానం చేశారు. మొబైల్ రొబోటిక్స్, ఐటి ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ కన్ స్ట్రక్షన్ వంటి నైపుణ్య విభాగాల్లో రాష్ట్ర యువత పురస్కారాలు దక్కించుకున్నారు. గతం కంటే ఈసారి పోటీల్లో రాష్ట్ర యువత మెరుగ్గా రాణించారు. 2018లో జరిగిన నైపుణ్య పోటీల్లో రాష్ట్రానికి 8 అవార్డులు దక్కగా.. ఈసారి జరిగిన పోటీల్లో 18 అవార్డులు దక్కాయి. అందులో 11బంగారు, 7 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన వీరంతా జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటారు. జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు మనదేశం తరుఫున 2022 అక్టోబర్ నెలలో చైనాలోని షాంఘై నగరంలో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కుతుంది.
ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఉన్నత ఆలోచనలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం విశాఖకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి నైపుణ్య పోటీల్లో పాల్గొనడం ద్వారా యువత కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడంతోపాటు పోటీ తత్వాన్ని కూడా అలవాటు చేసుకోగలుగుతారని అన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన ఉత్సాహంతోనే జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.యువత తమలో నైపుణ్యాలు పెంచుకుని దేశాభివృద్ధిలో భాగం కావాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు యువతకు ఉద్యోగ, ఉాపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించారన్నారు.
ఎపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణా కార్యాక్రమాలను అమలు చేయడంతోపాటు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లు, జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీతోపాటు యూనిర్సిటీ కూడా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. ఈ నైపుణ్య పోటీలు విజయవంతంగా ముగియడానికి కారణమైన ఎన్ఎస్డిసీ, ఎపిఎస్ఎస్డిసి, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సభ్యులతోపాటు పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రాయూనివర్సిటీ ఇతర వేదికల ప్రతినిధులను ఆయన అభినందించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ) చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి అభినందనలు తెలిపారు. జనవరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు మరింత శ్రద్ధతో సిద్ధంమై అక్కడా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. వరల్డ్ స్కిల్స్ అకాడమీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఎన్.ఎస్.డి.సి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలు మన రాష్ట్రంలోని యువతకు కూడా అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన అన్నారు. అందుకు అనుగుణంగానే ఐటి, ఆక్వా, మ్యానుఫ్యాశ్చురింగ్, అగ్చికర్చర్, ఫార్మా లాంటి రంగాల్లో ఉపాధి అకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని.. ఇందుకోసం ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో 25 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు.
రెండు రోజులపాటు 11 వేదికల్లో దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు విజయంతంకావడానికి కృషి చేసిన జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆతిథ్యం ఇచ్చిన వేదికల సిబ్బందిని చల్లా మధుసూదన్ రెడ్డి అభినందించారు. చివరగా ఎపిఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన అందిరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికంటే మెరుగ్గా రాణించి వచ్చే పోటీల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా ముందుకు వెళ్తుందని ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండీ బంగారరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పోటీల్లో మొత్తం 51 టెక్నికల్ ట్రేడ్స్ లో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన 124 మందిని నైపుణ్య పోటీల్లో విజేతలుగా జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. కేరళ-32, కర్ణాటక -29, తమిళనాడు- 21, ఆంధ్రప్రదేశ్- 18, తెలంగాణ- 2; విజేతలుగా నిలిచారు. ఇతర ప్రాంతాల్లో నిర్వహించని విభాగాలకు ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవకాశం కల్పించి పోటీలు నిర్వహించారు. 100 మందికిపైగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనగా వీరిలో 22 మందిని విజేతలుగా ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, వరల్డ్ స్కిల్స్ ఇండియా సీనియర్ హెడ్ కల్నల్ అరుణ్ చందేల్, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండీ బంగారరాజు, విశాఖ మేయర్ హరివెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, డీసీఎం చైర్పర్సన్ పల్లా చినతల్లి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: దేశం గర్వించతగ్గ ఘటన.. ఆ చిరస్మరణీయ విజయానికి విశాఖ వేదికైంది.
Comments
Please login to add a commentAdd a comment