m srinivasa Rao
-
దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్
సాక్షి,విశాఖపట్నం: దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ అవార్డులను ఆతిథ్య ఏపీ సొంతం చేసుకుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ నైపుణ్య పోటీలు ఘనంగా ముగిశాయి. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరై విజేతలందరికీ అవార్డులను ప్రదానం చేశారు. మొబైల్ రొబోటిక్స్, ఐటి ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ కన్ స్ట్రక్షన్ వంటి నైపుణ్య విభాగాల్లో రాష్ట్ర యువత పురస్కారాలు దక్కించుకున్నారు. గతం కంటే ఈసారి పోటీల్లో రాష్ట్ర యువత మెరుగ్గా రాణించారు. 2018లో జరిగిన నైపుణ్య పోటీల్లో రాష్ట్రానికి 8 అవార్డులు దక్కగా.. ఈసారి జరిగిన పోటీల్లో 18 అవార్డులు దక్కాయి. అందులో 11బంగారు, 7 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన వీరంతా జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటారు. జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు మనదేశం తరుఫున 2022 అక్టోబర్ నెలలో చైనాలోని షాంఘై నగరంలో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కుతుంది. ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఉన్నత ఆలోచనలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం విశాఖకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి నైపుణ్య పోటీల్లో పాల్గొనడం ద్వారా యువత కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడంతోపాటు పోటీ తత్వాన్ని కూడా అలవాటు చేసుకోగలుగుతారని అన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన ఉత్సాహంతోనే జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.యువత తమలో నైపుణ్యాలు పెంచుకుని దేశాభివృద్ధిలో భాగం కావాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు యువతకు ఉద్యోగ, ఉాపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించారన్నారు. ఎపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణా కార్యాక్రమాలను అమలు చేయడంతోపాటు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లు, జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీతోపాటు యూనిర్సిటీ కూడా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. ఈ నైపుణ్య పోటీలు విజయవంతంగా ముగియడానికి కారణమైన ఎన్ఎస్డిసీ, ఎపిఎస్ఎస్డిసి, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సభ్యులతోపాటు పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రాయూనివర్సిటీ ఇతర వేదికల ప్రతినిధులను ఆయన అభినందించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ) చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి అభినందనలు తెలిపారు. జనవరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు మరింత శ్రద్ధతో సిద్ధంమై అక్కడా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. వరల్డ్ స్కిల్స్ అకాడమీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఎన్.ఎస్.డి.సి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలు మన రాష్ట్రంలోని యువతకు కూడా అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన అన్నారు. అందుకు అనుగుణంగానే ఐటి, ఆక్వా, మ్యానుఫ్యాశ్చురింగ్, అగ్చికర్చర్, ఫార్మా లాంటి రంగాల్లో ఉపాధి అకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని.. ఇందుకోసం ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో 25 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. రెండు రోజులపాటు 11 వేదికల్లో దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు విజయంతంకావడానికి కృషి చేసిన జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆతిథ్యం ఇచ్చిన వేదికల సిబ్బందిని చల్లా మధుసూదన్ రెడ్డి అభినందించారు. చివరగా ఎపిఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన అందిరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికంటే మెరుగ్గా రాణించి వచ్చే పోటీల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా ముందుకు వెళ్తుందని ఎపిఎస్ఎస్డిసి ఎండీ బంగారరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో మొత్తం 51 టెక్నికల్ ట్రేడ్స్ లో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన 124 మందిని నైపుణ్య పోటీల్లో విజేతలుగా జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. కేరళ-32, కర్ణాటక -29, తమిళనాడు- 21, ఆంధ్రప్రదేశ్- 18, తెలంగాణ- 2; విజేతలుగా నిలిచారు. ఇతర ప్రాంతాల్లో నిర్వహించని విభాగాలకు ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవకాశం కల్పించి పోటీలు నిర్వహించారు. 100 మందికిపైగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనగా వీరిలో 22 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, వరల్డ్ స్కిల్స్ ఇండియా సీనియర్ హెడ్ కల్నల్ అరుణ్ చందేల్, ఎపిఎస్ఎస్డిసి ఎండీ బంగారరాజు, విశాఖ మేయర్ హరివెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, డీసీఎం చైర్పర్సన్ పల్లా చినతల్లి తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశం గర్వించతగ్గ ఘటన.. ఆ చిరస్మరణీయ విజయానికి విశాఖ వేదికైంది. -
పాపికొండలకు చలోచలో
రంపచోడవరం: గోదావరి నదీ జలాల్లో పాపికొండల విహార యాత్రను రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 114 మంది పర్యాటకులతో రెండు బోట్లు ఆదివారం పాపికొండల విహారానికి వెళ్లాయి. ఈ యాత్రను తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రారంభించారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వేసుకోవాలని పర్యాటకులకు సూచించారు. పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 9 కమాండ్ కంట్రోల్ రూముల పర్యవేక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పర్యాటక శాఖల అనుసంధానంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని విహార యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. శాటిలైట్ సిస్టమ్ ద్వారా బోట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పర్యాటకుల బోట్లు బయలుదేరడానికి ముందు ఎస్కార్ట్ బోటు వెళ్తుందని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా.. వెనుక వచ్చే పర్యాటక బోట్లకు సమాచారమిస్తారని తెలిపారు. ఏపీ టూరిజం వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని, దీనివల్ల పర్యాటక బోట్లలో ఎంతమంది వెళ్తున్నారనే లెక్క పక్కాగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం 11 బోట్లకు అనుమతులిచ్చామని, వీటిలో ఏపీ టూరిజం బోట్లు 2, ప్రైవేట్ బోట్లు 9 ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ఎంపీపీ కుంజం మురళి, జెడ్పీటీసీ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. గోదావరిపై ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో గోదావరి జలాలపై తేలియాడేలా తీర్చిదిద్దిన ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. రెండు స్టీల్ పంటులపై ఏర్పాటు చేసిన ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్లో 95 మంది ప్రయాణించవచ్చు. ఈ రెస్టారెంట్‌కు పద్మావతి ఘాట్ నుంచి వెళ్లవచ్చు. 15 రోజుల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. వివాహ విందులు, పుట్టిన రోజు, కిట్టీ పార్టీల వంటివి నిర్వహించుకునేందుకు వీలుగా దీనిని అధికారులు సిద్ధం చేయనున్నారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ ఎ.వరప్రసాద్‌రెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. -
విజయనగర ఉత్సవాలు ప్రారంభం
సాక్షి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు శనివారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు ప్రారంభించారు. ఆలయం నుంచి ర్యాలీగా ప్రారంభమైన ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. జిల్లాలోని ఆనంద గజపతి ఆడిటోరియం ఆవరణలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవ కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ కళారూపాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, సంబంగి చిన అప్పలనాయుడు, అప్పల నరసయ్య, రాజన్న దొర, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. విజయనగరం ఉత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల నిర్వహణకు పర్యాటక శాఖ నుంచి రూ.50 లక్షలు ఇస్తూ జీవో విడుదల చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యల నగరంగా విజయనగరం వర్ధిల్లుతోందన్నారు. సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్క అక్టోబర్ నెలలోనే వాలంటీర్ల నియామకం, ఆటో డ్రైవర్లకు చేయూత, కంటి వెలుగు, రైతు భరోసా కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేశారు. దీపావళికల్లా ఇసుక కొరత తీర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. -
పత్రికలే పట్టుగొమ్మలు
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు పట్టుగొమ్మలు వంటివని, వాటిలో పని చేసే వారంతా జిల్లాను మంచి మార్గంలో నడిపించాలని విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు సూచించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గురజాడ వంటి ఎందరో మహనీయులు నడయాడిన విజయనగరాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలని కోరారు. ప్రెస్ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు పోలీసులకు కీలకంగా ఉపయోగపడతాయన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ మాట్లాడుతూ ప్రజల నాడి తెలుసుకునే వైద్యులు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లని వాఖ్యానించారు. ప్రజల అవసరాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా అధికారులమైన తాము వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాహితీరాజధానిగా వెలుగొందుతున్న విజయనగర కీర్తిని కొనసాగించే బాధ్యత పత్రికలపై ఉందన్నారు. అనంతరం జిల్లాలో ఫొటోగ్రఫీ సేవలందిస్తున్న కాండ్రేగుల రామారావు, జీవీఎస్ఆర్ మూర్తి, ఎం.సీతారామ్, పి.రాజేశ్వరరావు, డి.సత్యనారాయణమూర్తి, కాళ్ల శ్రీనివాసరావు, జంపు నాయుడు, గిడిజాల శ్రీను, ఎ.కిశోర్, ఆర్ దాలిరాజులను ఘనంగా సత్కరించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జరజాపు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, మహాపాత్రో, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి సముద్రాల గురుప్రసాద్ పాల్గొన్నారు.