
18–50 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే..
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబాలకు ప్రభుత్వం వైఎస్సార్ బీమా అందజేస్తోంది.
గత నెల 29న నమోదు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ నెల 7లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ బీమా పథకాన్ని 2021 జూలై 1న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
కాగా, 2023–24కు సంబంధించి జూలై 1 నుంచి వైఎస్సార్ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. 18–50 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారంగా అందజేస్తారు. అలాగే 18–70 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు.
బీమా కంపెనీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పరిహారం చెల్లింపును ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.372 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.