సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నదాతలకు మెరుగ్గా ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారికి అనుక్షణం అండగా ఉంటోంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడమేగాక క్షేత్రస్థాయిలో వారి సమస్యలకు తక్షణం పరిష్కారం చూపుతోంది. ఇప్పటికే 4.5 లక్షలమంది రైతులు ఈ గ్రూపుల్లో చేరి సాగులో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యం 38.14 లక్షల హెక్టార్లు. దాంట్లో 15.99 లక్షల హెక్టార్లలో వరి, 3.63 లక్షల హెక్టార్లలో అపరాలు, 7.98 లక్షల హెక్టార్లలో నూనెగింజలు, 6 లక్షల హెక్టార్లలో పత్తి, 1.50 లక్షల హెక్టార్లలో మిరప, మిగిలినదాన్లో ఇతర పంటలు సాగుచేస్తున్నారు.
రాష్ట్రంలో 54 లక్షలమంది రైతులున్నారు. మొత్తం రైతుల్లో 70 నుంచి 80 శాతం మంది వరి, అపరాలు సాగుచేస్తున్న వారే. ఇప్పటివరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సమాచారం కావాలంటే రైతుభరోసా కేంద్రానికి (ఆర్‌బీకేకు) వెళ్లి సిబ్బందిని అడిగి తెలుసుకునేవారు. సాగువేళ సందేçహాలు, సమస్యలొస్తే తెలిసిన రైతుకో, సమీప వ్యవసాయాధికారికో చెప్పి వారి సలహాలు, సూచనలు పాటించేవారు. సమస్య తీవ్రంగా ఉంటే శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లి నివారణ చర్యలు తీసుకునే వారు.
అరచేతిలోనే సమగ్ర సమాచారం
రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్‌బీకేలు పనిచేస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల వారీగా రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలతోపాటు ఆయా ప్రాంతాల వలంటీర్లను కూడా చేర్చారు. స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్న రైతులను ఇప్పటికే ఈ గ్రూపుల్లో చేర్చారు. రైతులు బేసిక్ ఫోన్ వాడుతుంటే వారి కుటుంబసభ్యుల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారి నంబరును ఈ గ్రూపులో చేర్చారు. ఫోన్లు ఉపయోగించని రైతులకు వలంటీర్ల ద్వారా గ్రూపులోని సమాచారం తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 19,364 గ్రూపులు ఏర్పాటు చేశారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,481 గ్రూపులు ఏర్పాటు చేయగా, అత్యల్పంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 846 గ్రూపులు ఏర్పాటు చేశారు. మిగిలిన వారిని కూడా ఖరీఫ్ సాగు పూర్తయ్యేలోగా గ్రూపుల్లో చేర్చాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్‌బీకేలో విత్తన, ఎరువులు, పురుగుల మందుల నిల్వలు ఎంతున్నాయి? ఆర్‌బీకే చానల్ ద్వారా ఏ పంటకు సంబంధించి ఏ శాస్త్రవేత్త ఎప్పుడు రైతులతో ముఖాముఖి అవుతున్నారు? ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. జిల్లాస్థాయి వనరుల కేంద్రంలోని కేవీకే, వర్సిటీ శాస్త్రవేత్తలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పంటలను పరిశీలించి ఆడియో, వీడియో సందేశాలు (మెసేజ్‌లు) తయారు చేస్తున్నారు. 20 సెకన్ల నుంచి ఒకటిన్నర నిమిషాల నిడివితో రూపొందిస్తున్న ఈ సందేశాలను వాట్సావ్ గ్రూపుల్లో ఉంచుతున్నారు. ఈ వీడియోలకు రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
వీడియో సందేశంతో సమస్య తీరింది
ఖరీఫ్‌లో సాగుచేస్తున్న మిరపలో ముడత బాగా ఎక్కువగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆర్‌బీకేలో మిరప సాగు రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో శాస్త్రవేత్తలు పెట్టిన వీడియో చూశాను. ఎవర్నీ అడగలేదు. ఆ వీడియోలో చెప్పినట్టు ఫిప్రోనిల్ 250 గ్రాములు, మోనోక్రోటోపాస్ 250 గ్రాములను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేశా. మరుసటి రోజుకు ముడత తగ్గిపోయింది. ఇలా ఏ సమస్య వచ్చినా వీడియో రూపంలో మాకు చక్కని పరిష్కారం చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
– చిట్టినేని వెంకటసతీష్‌కుమార్, చినఓగిరాల, కృష్ణా జిల్లా
రైతులకు మరింత చేరువవ్వాలనే..
ఆర్‌బీకేల్లో వ్యవసాయ సహాయకులు రైతులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. ఆర్‌బీకేల ద్వారా అందిస్తున్న సేవలను తెలియజేస్తున్నారు. సాగువేళ వారికొచ్చే సందేహాలు, సమస్యల పరిష్కారానికి ఈ గ్రూపులు ఎంతగానో దోహద పడుతున్నాయి. వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, మిల్లెట్స్‌తో సహా ప్రధాన పంటలను కవర్ చేసేలా వ్యవసాయ విస్తరణ విభాగం తెలుగులో రూపొందించిన వాట్సప్ సందేశాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్ వ్యవసాయశాఖ
పంటలవారీ రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల సంఖ్య
పంట వాట్సాప్ గ్రూపుల సంఖ్య
వరి, ఇతర ఆహారధాన్యాలు 9,181
ఉద్యానపంటలు 2,208
అపరాలు 2,178
నూనెగింజలు 2,132
పత్తి 1,737
మిరప 788
చెరకు 457
పసుపు 150
పట్టు 150
కొబ్బరి 127
పొగాకు 61
తమలపాకు 3
ఇతర పంటలు 192
మొత్తం 19,364
Comments
Please login to add a commentAdd a comment