APSRTC: ఆర్టీసీలో 'సొసైటీ' ఎన్నికల వేడి  | APSRTC CCS elects new board with 9 directors on 29th | Sakshi
Sakshi News home page

APSRTC: ఆర్టీసీలో 'సొసైటీ' ఎన్నికల వేడి 

Published Wed, Dec 1 2021 3:25 AM | Last Updated on Wed, Dec 1 2021 8:52 AM

APSRTC CCS elects new board with 9 directors on 29th - Sakshi

తిరుపతి అర్బన్‌: ఆర్టీసీకి చెందిన క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) ఎన్నికలను అన్ని ఉద్యోగ సంఘాలకు చెందిన అసోసియేషన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో బోర్డును తమ అసోసియేషన్‌ కైవసం చేసుకోవాలంటూ ఉద్యోగ సంఘం నేతలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. డిపోల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో మొత్తం పది అసోసియేషన్లు పోటీలో ఉన్నా, ప్రధానంగా మూడు అసోసియేషన్లు నువ్వా నేనా అన్నట్లు పోటీగా ప్రచారం చేస్తున్నాయి.

రాష్ట్రంలోని 129 డిపోలకు కలిపి 210 డెలిగేట్‌ స్థానాలున్నాయి. ఆయా డిపోల్లోని డెలిగేట్‌ స్థానాలను బట్టి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబర్‌ 6వ తేదీకి నామినేషన్ల తంతు ముగియనుండగా, డిసెంబర్‌ 14న ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్‌ పూర్తవుతుంది. 210 డెలిగేట్‌ స్థానాల్లో 50 శాతానికి పైగా స్థానాలు సాధించిన అసోసియేషన్‌కు బోర్డు కైవసమవుతుంది. విజయం సాధించిన అసోసియేషన్‌ డిసెంబర్‌ 29న 9 మంది డైరెక్టర్లతో కొత్త బోర్డును ఏర్పాటు చేయనుంది. వీరు డిసెంబర్‌ 31న విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేస్తారు. 9 మంది డైరెక్టర్లతోపాటు ముగ్గురు ఆర్టీసీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఐదేళ్లపాటు బోర్డు కొనసాగుతుంది. 

50,300 మంది సభ్యులు 
1956 నుంచి ఆర్టీసీ క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 50,300 మంది సభ్యులతో ఆసియాలోనే అత్యంత పెద్ద సొసైటీగా గుర్తింపు పొందింది. సభ్యత్వం ఉన్న ఉద్యోగుల బేసిక్‌ను ఆధారంగా చేసుకుని జీతంలో ప్రతి నెలా 4 శాతం సీసీఎస్‌కు కట్‌ అవుతుంది. ఈ క్రమంలో సీసీఎస్‌ ప్రస్తుతం రూ.1,550 కోట్లు టర్నోవర్‌ కొనసాగిస్తోంది. ప్రధానంగా సీసీఎస్‌లో సభ్యత్వం ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఇంటి రుణాలతోపాటు పిల్లల చదువు, వివాహం తదితరాలకు రుణాలు మంజూరు చేస్తారు. రూ.1 లక్ష నుంచి రూ.20 లక్షల మేరకు వారి వేతన స్థాయిలను బట్టి రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. రుణాలకు అతి తక్కువ వడ్డీ ఉంటుంది.   

విజయం సాధిస్తాం 
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసినట్లే ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఆర్టీసీ వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ పోటీ చేస్తోంది. తప్పకుండా విజయం సాధిస్తాం. 
– చల్లా చంద్రయ్య, ఆర్టీసీ వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

ఆ కుటుంబం అందరిదీ 
ఆర్టీసీ అభివృద్ధికి వైఎస్‌ కుటుంబం చేసిన మేలు ఎవరూ మరచిపోరు. ఆ కుటుంబం అంటే ఆర్టీసీ సిబ్బంది తమ కుటుంబంగా భావిస్తారు. పదేళ్లుగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ అండ్‌ అసోసియేషన్‌ బోర్డును కైవసం చేసుకుంది. ఎంతో మందికి రుణాలు ఇప్పించాం. మా అసోసియేషన్‌ను గెలిపించాలని కోరుతున్నాం. 
– ఆవుల ప్రభాకర్‌ యాదవ్, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అండ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ  

ఉద్యోగులకు అండగా 
నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అసోసియేషన్‌ ఉద్యోగులకు  అండగా నిలుస్తోంది. మేము వైఎస్‌ కుటుంబానికి కృతజ్ఞత కల్గిన వాళ్లమే. సీఐటీయూ పొత్తుతో రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాం. 
– బీఎస్‌ బాబు, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ జిల్లాసెక్రటరీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement