ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సర్విసులు
విశాఖ టు పుదుచ్చేరి, చెన్నైకి నడపనున్న జీఏసీ షిప్పింగ్ సంస్థ
విశాఖ నుంచి కార్డేలియా క్రూయిజ్ షిప్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పర్యాటకులకు సముద్ర ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా అందించేందుకు విశాఖపట్నంలో నిర్మించిన అధునాతన టెర్మినల్ నుంచి క్రూయిజ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4 నుంచి 22వ తేదీ మధ్య పుదుచ్చేరి, చెన్నైకి మూడు సర్విసులు నడిపేందుకు కార్డేలియా క్రూయిజ్ షిప్ సిద్ధమవుతోంది. జీఏసీ షిప్పింగ్ సంస్థ ఈ సర్విసులు నడపనుంది. అంతర్జాతీయస్థాయిలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌ను 2023 సెప్టెంబరు 4న అధికారికంగా ప్రారంభించారు. ఆగస్టు నెల నుంచి ఈ టెర్మినల్ ద్వారా సర్విసులు ప్రారంభం కానున్నాయని ఇటివల విశాఖ పోర్టులో జరిగిన సమావేశంలో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలికి అధికారులు వివరించారు. ఈ ఆధునిక క్రూయిజ్ టెర్మినల్‌లో ఉన్న సౌకర్యాల గురించి ఈ సందర్భంగా టూరిజం ఆపరేటర్లకు, ఇతర సంస్థలకు విశాఖపట్నం పోర్టు అధికారులు వివరించారు.
అంతర్జాతీయ హంగులు..
అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక హంగులతో విశాఖ క్రూయిజ్ టెర్మినల్ మొత్తం 3,530 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ 2,750 చ.మీ. విస్తీర్ణంలో ప్రయాణికుల రాకపోకల కోసం వినియోగిస్తారు. మొదటి అంతస్తు 780 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ టెర్మినల్‌లో 180 మీటర్ల పొడవు గల బెర్త్ ఉంటుంది. నాలుగు మూరింగ్ డాల్పిన్లతో కలిపి 330 మీటర్ల పొడవు, 37.6 మీటర్ల వెడల్పు, 8.1 మీటర్ల డ్రాఫ్ట్ గల పెద్ద క్రూయిజ్ షిప్‌లను ఇది హ్యాండిల్ చేయగలదు.
ఒకేసారి రెండువేల మంది ప్రయాణికులకు అవసరమైన అన్నిసేవలు అందించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఈ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్ క్లియ రెన్స్ కౌంటర్లు, పార్కింగ్, డ్యూటీ ఫ్రీ షాప్స్, ఫుడ్ కోర్ట్‌లు, లాంజ్‌లు ఉన్నాయి.
11 అంతస్తుల భారీ షిప్ కార్డేలియా..
ఆగస్టు నెలలో విశాఖ టెర్మినల్‌కు రానున్న ‘కార్డేలియా’ 11 అంతస్తులున్న భారీ క్రూయిజ్ షిప్. ఇందులో ఒకేసారి 1,800 మంది వరకూ ప్రయాణించవచ్చు. 692 అడుగుల పొడవు కలిగిన ఈ భారీ షిప్‌లో ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, థియేటర్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షో తదితర సౌకర్యాలు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. అయితే, లిక్కర్, ఇతర సర్విసులకు మాత్రం అదనపు చార్జీలు వసూలు చేస్తారు. 48,563 టన్నుల బరువైన ఈ భారీ నౌకలో 796 కేబిన్లు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment