తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి
19న విజయవాడలో వామపక్షాల నిరసన
వామపక్ష నేతలు వెల్లడి
సాక్షి, అమరావతి: సర్దుబాటు పేరుతో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపటం దుర్మార్గమని, ఆ చార్జీలను రద్దు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వామపక్షాల నేతలు ప్రకటించారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. అనంతరం సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు విలేకరుతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు చార్జీల భారం రూ.6,072 కోట్లు మోపగా, ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల భారం మోపాలనుకోవడం దుర్మార్గం.
మరో విద్యుత్ ఉద్యమానికి శ్రీకారం చుడతాం. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చంద్రబాబు చెప్పారు. దానికి కట్టుబడి తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను రద్దుచేయాలి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదిన విజయవాడలో వామపక్షాల నిరసన తెలియజేస్తాం. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీ అజెండాను పవన్కళ్యాణ్ మోయడం తగదు’ అని చెప్పారు. వివిధ వామపక్ష పార్టీల నేతలు జల్లి విల్సన్, సీహెచ్ బాబూరావు, పి.ప్రసాద్, ఎస్‌కే.ఖాదర్బాషా, కె.పొలారి పాల్గొన్నారు.
18న ఇళ్ల పట్టాల సమస్యలపై వినతిపత్రాలు
ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమస్యలపై ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన వర్చువల్గా జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వరంలో ఈ నెల, వచ్చే నెలలో చేపట్టనున్న ఆందోళనలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment