ఆన్‌లైన్ యాప్‌ల్లో మట్కా జోరు
పేద, మధ్య తరగతి ప్రజలు చిత్తు
అప్పులు తీర్చలేక బలవన్మరణాలు
ఊర్లు వదులుతున్న మరికొందరు బాధితులు
ధర్మవరం: ఆన్‌లైన్ మట్కా యాప్‌లతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రూ.100 ఖర్చు పెడితే రూ.9వేలు డబ్బు వస్తుందని ఆశకు పోయి అప్పులు చేసి వడ్డీలు కట్టలేక రుణదాతల ఒత్తిళ్లతో ఊర్లు వదిలి వెళ్లిపోయిన వారు కొందరైతే... అవమాన భారం భరించలేక జీవితం మీద విరక్తి చెంది బలవన్మరణాలకు పాల్పడిన వారి ఉదంతాలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, రాప్తాడు నియోజకవర్గాలలో ఆన్‌లైన్ మట్కా యాప్‌ల ద్వారా జూదం జోరుగా సాగుతోంది.
జడలు విప్పుతున్న ఆన్‌లైన్ మట్కా భూతం
ఇటీవల సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, నిరక్షరాస్యుల నుంచి విద్యా వంతుల దాకా ప్రతి ఒక్కరికీ ఆండ్రాయిడ్ ఫోన్‌లు 4జీ, 5జీ నెట్‌వర్క్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్ మట్కా యాప్‌ల ద్వారా జూదం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అత్యాశకుపోయి ప్రజలు ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు.
అనధికార మట్కా యాప్‌లు
అనధికారికంగా రా్రïÙ్టయంగా, జాతీయంగా, ప్రాంతీయంగా ఆన్‌లైన్ మట్కా యాప్‌లు నిర్వహిస్తున్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు సైతం ఇలానే యాప్‌లను నిర్వహిస్తూ మోసం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో మట్కా కింగ్, సత్తా కింగ్ ఏపీ, ఏపీ మట్కా, తిరుమల మట్కా, విజయవాడ మట్కా తదితర యాప్‌లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి. వీటి ద్వారా జిల్లాలో రోజూ లక్షలాది రూపాయల టర్నోవర్ జరుగుతున్నట్లుగా సమాచారం. వీటిలో ఏ ఒక్కటికి కూడా
అనుమతి లేదు.
ఊర్లు వదులుతున్న బాధితులు
ఆన్‌లైన్ మట్కా యాప్‌ల కారణంగా అప్పులు చేసి.. రుణదాతల ఒత్తిళ్లు తాళలేక జిల్లా వ్యాప్తంగా పలు కుటుంబాలు ఊర్లు వదిలి వెళ్తున్నాయి. మరికొంత మంది బాహ్య ప్రపంచానికి ముఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరెన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.
కట్టడి కష్టతరం
మట్కా జూదం మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతుండటంతో పోలీసులు కట్టడి చేయడం కష్టతరమౌతోంది. ఎందుకంటే జూదం ఆడేవారిని గానీ, ఆడించే వారిని గానీ కనుగొనడం సాధ్యం కాదు. అయితే సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో ఈ ఆన్‌లైన్‌యాప్‌లు ఇన్‌స్టాల్ కాకుండా వెబ్‌సైట్‌లను బ్యాన్ చేయడం ద్వారా కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితే ఎంతో మంది పేద, మధ్యతరగతి, యువత జీవితాలను కాపాడిన వారవుతారు.
ఉక్కుపాదం మోపుతాం
ఆన్‌లైన్ మట్కా జూదం ఆడేవారిని, ఆడించే వారిపై ఉక్కుపాదం మోపుతాం. ఈ దిశగా ఇప్పటికే ప్రజలకు అవగాహన పెంపొందిస్తున్నాం. సైబర్‌క్రైం సహకారంతో ఆన్‌లైన్ మట్కా యాప్‌లు, వెబ్‌సైట్‌లు నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాం. పేద, మధ్య తరగతి ప్రజలు జూదం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుని వ్యసనాలకు దూరంగా ఉండాలి.
– వి.రత్న, ఎస్పీ, శ్రీ సత్యసాయి జిల్లా
బానిసగా మారుస్తారు ఇలా..
ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా మట్కా నిర్వహిస్తున్న పలు అనధికారిక కంపెనీలు, సైబర్ నేరగాళ్లు పేద, మధ్యతరగతి ప్రజలు, యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ గంట గంటకూ ఫలితాలు వెల్లడిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్‌లైన్ మట్కా యాప్‌లలో తొలుత లాగిన్ అయిన తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బు స్వీకరిస్తారు. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, త్రీస్టార్ వంటి పేర్లతో జూదం ఆడిస్తారు.
ప్రజలు తాము చెప్పిన నంబర్ తగిలితేనే వారికి యాప్‌ల ద్వారా డబ్బు చెల్లిస్తారు. లక్షలో పది మంది కూడా ఈ యాప్‌ల ద్వారా లబ్ధి పొందరు. అయితే తొలుత చిన్న చిన్న మొత్తాలు వేసిన వారి వివరాలు సేకరించి యాప్‌ల నిర్వాహకులు వారు చెప్పిన నంబర్లే తగిలే విధంగా చేస్తారు. నెమ్మదిగా వారు అలవాటు పడగానే జూదానికి బానిసయ్యే విధంగా మార్చేస్తారు.
⇒ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివానగర్‌కు చెందిన పట్టుచీరల వ్యాపారి రాము (పేరు మార్చాం) ఆన్‌లైన్ మట్కా యాప్‌కు బానిసయ్యాడు. రూ.10 వడ్డీకి అప్పు తెచ్చి మరీ మట్కాలో పెట్టాడు. వడ్డీలు కట్టేందుకు రెట్టింపు అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిళ్లు తాళలేక ఉన్న ఇల్లు, పొలం అమ్మి అప్పులు చెల్లించి బెంగళూరుకు చేరుకుని కూలి పనులు చేసుకుంటున్నాడు.
⇒ జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో ఆన్‌లైన్ మట్కా యాప్‌కు అలవాటు పడి బీటెక్ విద్యార్థి శివ తోటి స్నేహితులు, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఎటో వెళ్లిపోయాడు. చివరకు బంధువుల వద్ద ఉన్నాడని తెలుసుకుని తల్లిదండ్రులు రూ.2 లక్షల అప్పులు చెల్లించి తిరిగి తీసుకువచ్చారు. చదువులో ఇంటెలిజెంట్ అయిన శివ ఆన్‌లైన్ జూదం కారణంగా బాగా వెనుకబడ్డాడు.
⇒ బత్తలపల్లి మండలానికి చెందిన వెంకటప్ప కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆన్‌లైన్ మాట్కా యాప్ ద్వారా జూదం ఆడుతూ సంపాదన మొత్తం పోగొట్టుకుంటున్నాడు. దీంతో ఆ కుటుంబం దుర్భర పరిస్థితి అనుభవిస్తోంది. పైన చెప్పినవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment