సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: మిచాంగ్ తుపాను రాష్ట్రంపై విరుచుకుపడిన నేపథ్యంలో ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. 4 రోజుల ముందు నుంచే అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభావిత జిల్లాలను సైతం ముందే సంసిద్ధం చేసింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా, సాధ్యమైనంత వరకు నష్టాన్ని నివారించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతోపాటు అందుకు అనుగుణంగా అన్నీ సమకూర్చారు.
ప్రభావిత 8 జిల్లాల్లో ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. 204 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ 15,173 మందికి పునరావాసం కల్పించారు. పునరావాస కేంద్రాల్లో వారికి ఆహారం, మంచి నీటి సౌకర్యం కల్పించారు. 80కి పైగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల ప్రజలకు ఎలాంటి వైద్య పరమైన సమస్యలు వచ్చినా చికిత్స అందిస్తున్నారు.
అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి విపత్తుల సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుపాను కదలికలు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కలెక్టర్లకు సూచనలు జారీ చేస్తూ వచ్చారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను నాలుగు రోజుల ముందే ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. వర్షాలు, ఈదురు గాలుల గురించి ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపి అప్రమత్తం చేసింది. బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కేజీ చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
సహాయక చర్యల కోసం రూ.23 కోట్లు విడుదల
తుపాను సహాయక చర్యల కోసం ప్రభుత్వం 11 జిల్లాలకు రూ.23 కోట్లు విడుదల చేసింది. పునరావాస కేంద్రాలు, బాధితులకు ఆహారం, నిత్యావసరాలు ఇతరత్రా అవసరాల కోసం రూ.11 కోట్లు, అత్యవసరంగా బాధిత కుటుంబాలకు రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సహాయం అందించడం.. కూలిన, దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇవ్వడం వంటి అవసరాలకు రూ.13 కోట్లను కలెక్టర్లకు విడుదల చేశారు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రూ.6 కోట్లు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, గుంటూరు, ఎన్టీఆర్, తూ.గోదావరి జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించారు. ఈ నిధులతో కలెక్టర్లు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగంగా నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వలంటీర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులంతా తుపాను పర్యవేక్షక పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్న ఎస్డీఆర్‌ఎఫ్
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తుల స్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్) ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపడుతోంది. 3 బెటాలియన్లకు చెందిన 6 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు కృష్ణా, ప్రకాశం, బాపట్ల, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాల్లో సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. విరిగిపడిన చెట్లను తొలగిస్తూ.. రోడ్డు మార్గంలో రాకపోకలను పునరుద్ధరిస్తున్నాయి. వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నాయి.
సమష్టిగా సహాయక చర్యలు
► తిరుపతి జిల్లా యంత్రాంగం సమష్టిగా సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను 54 పునరావాస కేంద్రాలకు తరలించింది. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. నీట మునిగిన పంటల గురించి వ్యవసాయ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. పునరావాస కేంద్రాలను కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలసి స్పెషల్ ఆఫీసర్ శ్యామల రావు మంగళవారం పరిశీలించారు.
► నెల్లూరులోని మాగుంట లేఅవుట్ ప్రధాన రహదారి, మూలాపేట తదితర ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన చెట్లను జేసీబీ సాయంతో తొలగించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా డ్రెయిన్లు, పంట కాలువలు తదితరాల్లో పూడిక తీశారు.
► పశ్చిమగోదావరి జిల్లాలో తీర ప్రాంత గ్రామాల నుంచి 5,113 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆహార అవసరాల కోసం కేంద్రాల వద్ద 608.56 కిలోల బియ్యం, 1202 కేజీల గోధుమ పిండి, 2640 కిలోల పంచదారను అందుబాటులో ఉంచారు. 11 మంది గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో సిబ్బందితో ఏర్పాటుచేసిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు రోడ్లపై పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
► ఉమ్మడి కృష్ణా జిల్లాలో సివిల్ సప్లయిస్ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, కలెక్టర్లు ఢిల్లీరావు, పి.రాజాబాబు పర్యవేక్షణలో రెవెన్యూ, వ్యవసాయశాఖ, సివిల్ సప్లయిస్ అధికారులు ధాన్యం రవాణాపై దృష్టి సారించారు. 3,300 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏలూరు జిల్లాలో రోడ్లపై అడ్డంగా పడిపోయిన చెట్లను పంచాయతీ సిబ్బంది, ఆర్‌అండ్‌బీ సిబ్బంది జోరువానలో తొలగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రకాశం జిల్లాలో పునరావాస కేంద్రాలను మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పరిశీలించారు.
► కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీర ప్రాంతంలో పర్యటించి పునరావాస ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారం రాత్రి తీరం వెంబడి ఉన్న 150 గృహాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంత్రులు విశ్వరూప్, చెల్లుబోయిన తదితరులు ముంపుబారిన పడిన వరిచేలను పరిశీలించారు.
► కోనసీమ జిల్లాలో 9 మండలాల్లో 41 గ్రామాలు తుపాను ప్రభావానికి గురికాగా, 37 పునరావస కేంద్రాలకు 910 మందిని తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment