
న్యూఢిల్లీ: డెకొరేటివ్ పెయింట్ల తయారీ, విక్రయ మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ఏషియన్ పెయింట్స్‌పై వస్తున్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. 90 రోజుల వ్యవధిలో నివేదికను సమరి్పంచాలని డైరెక్టర్ జనరల్‌కు సూచించింది.
డెకొరేటివ్ పెయింట్స్ విభాగంలో కొత్త సంస్థల రాకుండా అడ్డుకుంటూ, పరిశ్రమ వృద్ధి అవరోధాలు సృష్టించే విధానాలు పాటిస్తోందంటూ ఏషియన్ పెయింట్స్‌పై గ్రాసిం ఇండస్ట్రీస్ (బిర్లా పెయింట్స్ డివిజన్) చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
గ్రాసింలాంటి పోటీ సంస్థలతో లావాదేవీలు జరపకుండా డీలర్లకు ఆంక్షలు విధించడం, ముడి సరుకులు..సేవలు అందించకుండా నిరోధించడంలాంటి అంశాలు చూస్తే కొత్త సంస్థలను మార్కెట్లోకి రాకుండా ఆటంకాలు కల్పించడంతో పాటు మార్కెట్లో పోటీపై ఏషియన్ పెయింట్స్ ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందని సీసీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన గ్రాసిం గతేడాది ఫిబ్రవరిలో ’బిర్లా ఓపస్ పెయింట్స్’ పేరిట డెకొరేటివ్ పెయింట్స్ విభాగంలోకి ప్రవేశించింది.