పురాతన సంస్థగా పేరున్న ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్(ఐటీసీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 మంది ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చింది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..ఏటా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనం అందుకుంటున్న వారి సంఖ్య 350కు చేరింది. గతంలో ఇది 282గా ఉంది.
కంపెనీ ప్రకటించిన లెక్కల ప్రకారం..కోటి రూపాయలు వేతనం తీసుకుంటున్న ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.9 లక్షలు జీతం వస్తుంది. 2022-23 ఏడాదికిగాను రూ.1 కోటి వేతన బ్రాకెట్‌లోని ఉద్యోగుల సంఖ్య 282గా ఉంది. 2021-22 కంటే అదనంగా 62 మంది చేరారు. తాజాగా 68 మంది ఈ బ్రాకెట్‌లో చేరి మొత్తం 350 మంది రూ.1 కోటికిపైగా వేతనం అందుకుంటున్నారు.
ఇదీ చదవండి: ‘థ్యాంక్యూ సర్’ అన్నందుకు విమానం నుంచి దించారు!
ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరీ రూ.28.62 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇది గతంలో కంటే 50 శాతం పెరిగింది. కీలక నిర్వహణ సిబ్బంది (కేఎంపీ) వేతనం 59 శాతం పెరిగినట్లు కంపెనీ చెప్పింది. ఏడాదిలో దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను చెల్లించడం, మధ్యంతర కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సంఖ్య పెరగడం కూడా దీనికి కారణమని పేర్కొంది. కేఎంపీ మినహా ఉద్యోగుల సగటు వేతనం 9 శాతం పెరిగినట్లు చెప్పింది. మార్చి 31, 2024 నాటికి ఐటీసీలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 24,567కు చేరింది. సిగరెట్లు, ఎఫ్‌ఎంసీజీ, హోటళ్లు, అగ్రి బిజినెస్, పేపర్‌బోర్డ్‌లు, పేపర్ అండ్ ప్యాకేజింగ్ వంటి అనేక రకాల వ్యాపారాలను కలిగి ఉన్న ఐటీసీ 2023-24లో రూ.76,840.49 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment