పర్యావరణ సమతుల్యతకే పక్షుల గణన
తాళ్లరేవు: పర్యావరణంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు పక్షుల గణన ఎంతగానో దోహదపడుతుందని, అందువల్లే ప్రభుత్వం ఏటా ఈ కార్యక్రమం చేపడుతోందని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్ అన్నారు. శనివారం కోరంగి బయోడైవర్సటీ సెంటర్‌లో నిర్వహించిన ఏసియన్ వాటర్ బర్డ్ సెన్సస్ – 2025 వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. మడ అటవీ ప్రాంతంలో సంచరించే వివిధ రకాల పక్షులు, దూర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను లెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
దీనికి సంబంధించి తమ సిబ్బందితో పాటు ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, ఒక సైంటిస్ట్, ఒక స్టూడెంట్‌తో నలుగురు సభ్యులతో కూడిన 12 బృందాలను సిద్ధం చేశామన్నారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ప్రత్యేక కెమెరాలతో పలు ప్రాంతాల్లో పక్షుల గణన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఏపీ స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీరామ్ రెడ్డి పక్షులను ఎలా గుర్తించాలి, గణన ఎలా చేపట్టాలి అన్న అంశాలను ఆయా బృంద సభ్యులకు వివరించారు. అదే విధంగా పక్షుల గణన ప్రాముఖ్యతను సీనియర్ సైంటిస్ట్, బీఎన్‌హెచ్‌ఎస్ ప్రతినిధి ఎస్.శివకుమార్, రీసెర్చ్ సైంటిస్ట్ డి.మహేష్‌బాబు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా పక్షుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో 1967 నుంచి పక్షుల గణన ప్రారంభమైందని, అయితే ఆసియా ఖండంలో మాత్రం 1987 నుంచి 27 దేశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి డాక్టర్ ఈశ్వర్ సత్యనారాయణ, ఎఫ్‌ఎస్‌ఓలు, అటవీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫారెస్ట్ రేంజ్ అధికారి వరప్రసాద్
నేడు ప్రత్యేక బృందాలతో
నీటి పక్షుల లెక్కింపు
Comments
Please login to add a commentAdd a comment