మట్టి లారీలను అడ్డుకుని ఆందోళన
పి.గన్నవరం: ఊడిమూడిలంక నుంచి వస్తున్న మట్టి లారీల వల్ల తమ వంతెన ధ్వంసం అవుతున్నదంటూ జి.పెదపూడి గ్రామస్తులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. లంక నుంచి వస్తున్న మట్టి లారీలను వంతెన వద్ద అడ్డుకుని ఆందోళన చేపట్టారు. మట్టి లారీల రాకపోకల వల్ల వంతెన బలహీనం అవుతున్నదని జి.పెదపూడి సర్పంచ్ దంగేటి అన్నవరంతో పాటు పలువురు ఆందోళన కారులు వివరించారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలకు ఈ వంతెన ఆధారమన్నారు. లారీల రాకపోకల వల్ల వంతెన మార్జిన్లో ఉన్న మంచినీటి పైపు లైన్లు ధ్వంసం అవుతున్నాయని వివరించారు. వేరే వంతెన మీదుగా మట్టి లారీలు తరలించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో మరొక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు అక్కడికి రావడంతో వివాదం తలెత్తింది. కొన్నేళ్లుగా ఈ వంతెన మీదుగా మట్టి లారీలు వెళ్తున్నాయని, అప్పుడు ఎందుకు అడ్డగించలేదని ఆందోళన కారులను నిలదీశారు. వీరికి మట్టి ర్యాంపు నిర్వాహకుడి అనుచరులు కూడా తోడవడంతో ఇరువర్గాల మధ్య వివాదం పెరిగింది. విషయం తెలుసుకున్న పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలతో చర్చించారు. ఒకానొక దశలో వివాదం ముదరడంతో వారిని ఎస్సైతో పాటు, పోలీసు సిబ్బంది చెదరగొట్టారు. తహసీల్దార్ సమక్షంలో అధికారులతో చర్చించి వంతెన సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్సై సూచించారు. అనంతరం లారీలను పంపించి వేశారు. ఆందోళన కార్యక్రమంలో దంగేటి బాబీ, ఇందుకూరి రఘు, భూపతిరాజు రాజు పాల్గొన్నారు.
ఇంటర్ ప్రారంభ తరగతులను పరిశీలించిన డీఐఈవో
అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం నుంచి ప్రారంభమైన తరగతులను స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డీఐఈవో వనుము సోమశేఖరావు పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థినులతో మాట్లాడారు. ప్రణాళికా బద్ధమైన విద్యాభ్యాసం, భవిష్యత్ కార్యాచరణ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో తమ పిల్లలను చేర్చేందుకు ప్రభుత్వ జూనియర్ కళాళాలలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హాజరు పెరగడానికి వారి తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడాలని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సూచించారు.
4 నుంచి స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు
అమలాపురం టౌన్: జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 4వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు ఉందని జిల్లా రిజిస్ట్రార్ సీహెచ్ నాగలింగేశ్వరరావు తెలిపారు. అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్లాట్ బుకింగ్ విధానం అమలుపై కార్యాలయ సిబ్బందికి నాగ మల్లేశ్వరరావు అవగాహన కల్పించారు. భూముల రిజిస్ట్రేషన్లను కొనుగోలు, అమ్మకందార్లు తమకు నచ్చిన సమయంలో ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ 78 స్లాట్ బుకింగ్‌లు అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లాలోని 15 రిజిస్ట్రార్ కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్‌లను ఆదేశించారు.సబ్ రిజిస్ట్రార్లు ఆర్.శ్రీలక్ష్మి, పి.లక్షణరాజు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరాకు నేడు, రేపు అంతరాయం
కొత్తపేట: జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఆ ఆ శాఖ ఎస్‌ఈ సిద్దెల రాజబాబు తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో ప్రధానమైన సామర్లకోట 220 కేవీ సబ్ స్టేషన్‌లో విద్యుత్ పరికరాలు (కంట్రోల్ ప్యానెల్స్) మార్పు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో 132 కేవీ గ్రిడ్ సబ్ స్టేషన్ అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు పరిధిలో గల ప్రాంతాల్లో బుధవారం, గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో అప్పుడప్పుడూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
మట్టి లారీలను అడ్డుకుని ఆందోళన


