విభిన్న బ్రీడ్ల కుక్కలు, పక్షులు, పిల్లుల పెంపకం
వినూత్న పంథాలో సిటీ పెట్ లవర్స్..
రూ.20 వేల నుంచి లక్షల్లో ఖరీదు
ఆస్ట్రేలియా, యూకే, మెక్సికో నుంచి దిగుమతి
విల్లాల్లో వింత పెట్స్‌తో నగరవాసుల దోస్తీ
పెట్ అండ్ పెట్ లవర్స్.., సిటీలో ఈ పదాలకు ఒక క్రేజ్ ఏర్పడింది. మనుషులే కాకుండా వారి జీవితాల్లో సాధు జంతువులను మమేకం చేసుకుని, ఆతీ్మయతను పెంచుకుంటూ ఆనందానికి, ఆహ్లాదానికి, సాన్నిహిత్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయితే మొదటి నుంచి పెట్స్ అంటే కేవలం కుక్కలు, పావురాలు, పిల్లులను ఎక్కువగా పెంచుకునే వారు. కానీ మారుతున్న అధునాతన జీవన శైలికి అనుగుణంగా వినూత్నంగా విభిన్న రకాల పెట్స్‌ను పెంచుకుంటున్నారు. ఈ వెరైటీ పెట్స్‌లో పక్షుల నుంచి పాముల వరకూ ఎన్నో రకాల డొమెస్టిక్ పెట్స్‌ను సాకుతున్నారు. ఈ వెరైటీల్లో ఎక్కువగా ఇంపోర్టెడ్ పెట్స్ ఉంటున్నాయి. వీటి ఖరీదు సైతం అధికంగానే ఉంటుంది. పాతిక వేల నుంచి రూ.2 లక్షలకు పైబడి వెరైటీ పెట్స్ సిటీలో సరికొత్త కల్చర్‌గా మారింది.
నగరవాసుల్లో పెరిగిపోతున్న సాధు జంతువుల పెంపకం ఒక హబీ మాత్రమే కాదు.., ఇదొక సంస్కృతిగా మారింది. సాధారణ కుక్కల నుంచి మొదలై విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బల్లులు, తొండలు వంటివి ఈ కల్చర్‌లో భాగమైపోయాయి. గతంలో జర్మన్ షెఫర్డ్, ల్యాబడార్స్, గోల్డెన్ రిట్రైవర్, రాట్ వీలర్, పొమోనేరియన్, హచ్‌డాగ్ వంటి వాటిని ఇష్టంగా పెంచుకునే వారు. చౌ చౌ, షిట్జూస్ వంటి పప్పీస్‌కూ ఈ మధ్య ఆదరణ బాగా పెరిగింది. ఈ వెరైటీ డాగ్స్ సుమారు 75 వేల నుంచి లక్షల రూపాయల్లో లభిస్తున్నాయి.
పిల్లులకూ ప్రేమికులు..
కరోనా అనంతరం కొన్ని కారణాల వల్ల పెంపుడు జంతువుల ధరలు కాస్త తగ్గినట్లు పెట్స్ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం డాగ్స్‌తో పాటు బ్రిటిష్ షార్తైర్స్, రాగ్‌డాల్స్, మైన్ కూన్స్ వంటి విభిన్న రకాల పిల్లులను సైతం పెంచుతున్నారు. ఈ వెరైటీ పెట్స్ పై ఆసక్తి, అవగాహన పెరగడంతో ఈ మధ్య కాలంలో డాగ్ ఫో, క్యాట్ షోలు నగరంలో విరివిగా జరుగుతున్నాయి.
పక్షులకు భారీ క్రేజ్.. నగరంలో రిచ్
కల్చర్‌లో భాగంగా పక్షులను పెట్స్‌గా పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, మకావ్ వంటి పక్షులకూ క్రేజ్ పెరిగింది. ఇలువంటి విభిన్న రకాల పక్షులు సుమారు 20 వేల నుంచి 2 లక్షల వరకూ ధరల్లో లభిస్తున్నాయి. అయితే సాధారణంగా హంసలు అంటే చాలా మందికి ఇష్టం, కొందరు వీటిని తమ గార్డెన్‌లోని కొలనుల్లో పెట్స్‌గా పెంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బ్లాక్ స్వాన్ (నలుపు హంసలు) లకు డిమాండ్ పెరిగింది. వాటి నాణ్యతను బట్టి ఈ బ్లాక్ స్వాన్స్ జోడీ మార్కెట్ విలువ 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండటం గమనార్హం. ఇవే కాకుండా అందమైన పావురాలు, అ్రస్టిచ్‌తో పాటు విభిన్న రకాల చిట్టి పొట్టి జాతి పక్షులకూ ఆదరణ పెరిగింది.
విల్లాల్లో వింతగా..
నగరవాసులు విల్లాల్లో ఇంకొంచెం ముందడుగేసి సరీసుృపాల(పాకేవి–రెప్టైల్స్)ను కూడా పెంచేసుకుంటున్నారు. వీటినీ పెట్స్ జాబితాలో చేర్చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా కొన్ని రకాల జాతుల తొండలు, బల్లులు, పాములను విల్లాలు, ఫామ్‌హౌస్‌లలో పెంచుకోవడం ట్రెండ్‌గా మారుతోంది. ఈ తరహా కల్చెర్‌కు పలువురు జంతుప్రేమికులు ఇష్టపడుతున్నారు.
అనుమతులు తప్పనిసరి..
జంతు ప్రేమికులు ఎలా పడితే అలా.. వేటిని పడితే వాటిని.. పెంచుకోడానికి వీల్లేదు. సాధు జంతువులుగా గుర్తించబడుతున్నప్పటికీ వాటన్నింటినీ పెంచుకోడానికి అనుమతులు లేవని పెట్స్ నిపుణులు చెబుతున్నారు. అటవీ, జంతు సంరక్షణ శాఖ ఆధ్యర్యంలో కొన్ని రకాల వైల్డ్ యానిమల్స్‌ను పెంచకూడదు. వాటి సహజత్వాన్ని కోల్పోడానికి కారణమవుతుంది కాబట్టి, ఆహారం కూడా అందించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా కొన్ని రకాల పక్షులు, జంతువులకు మాత్రం సంబంధిత శాఖ అనుమతులతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుని పెంచుకోవచ్చని సూచించారు.
సంస్కృతికి ప్రతిబింబంగా..
మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా మరి కొందరు పుంగనూరు ఆవులను పెంచుకుంటున్నారు. ఇవే కాకుండా.. ఇంటీరియర్ అందాలను పంచే ఫిష్ ఆక్వేరియమ్‌లో అరుదైన చేపలు పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో గోల్డ్ ఫిష్ వంటి రకాలను అమితంగా ఇష్టపడుతున్నారు. కొందరైతే వాస్తు కోసం కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన చేపలను పెంచడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment