యువ కథ : పారిజాతం | Yuva Katha magazine storie | Sakshi
Sakshi News home page

యువ కథ : పారిజాతం

Published Sun, Jan 5 2025 9:06 AM | Last Updated on Sun, Jan 5 2025 9:06 AM

Yuva Katha magazine storie

తెల్లవారుజాము పావు తక్కువ నాలుగవుతోంది. ఎంతసేపు పక్క మీద దొర్లినా నిద్ర పట్టడం లేదు. చోటు మారడం వల్లనేమో. పుట్టి, పెరిగి, పాతికేళ్లు గడిపిన ఇల్లే అయినా ఎందుకో నిద్ర పట్టడం లేదు. వీథి చివర టీ కొట్టు వరకు నడిచి వెళ్లొస్తే బావుండనిపించి బయటకొచ్చేశాను.

ధనుర్మాసం.. చలి.. పారిజాతాలు!దారి మొత్తాన్ని ఆక్రమించేసిన పారిజాతాల్ని చూసి ఎన్నేళ్లు గడిచిపోయాయో సరిగ్గా గుర్తు లేదు. లెక్కపెట్టుకోవడం మానేసి కూడా చాలా సంవత్సరాలయ్యింది. ఈ మధ్య అసలేం గుర్తుండటం లేదు. నిమిషం క్రితం తీసి పెట్టిన కళ్లజోడు, నోట్లోనే నానుతూ ఉండే ఫోన్‌ నంబర్లు, అలవాటుపడిన దారులు కూడా మర్చిపోతున్నా. డాక్టర్‌ దగ్గరకు వెళితే ‘రోజుకు పదిమంది వస్తున్నారు సార్‌ మీవంటి పెద్దలు. అందరికీ అలై్జమర్స్‌ ఛాయలే.. ఎక్కువో తక్కువో! వృద్ధాప్య దశలో ఇవన్నీ మాములే’ అని డాక్టర్‌ కూడా సులువుగా చెప్పేశాడు. కాని జీర్ణించుకోవడం కష్టంగా మారింది.

ఏవో రోజువారి పనులు, ఏటీఎమ్‌ పిన్‌ నంబర్లు లాంటివి మర్చిపోతే దిగుల్లేదు.. అవి మర్చిపోతున్నానన్న బాధ కంటే ఎక్కడ జ్ఞాపకాలన్నీ చెదిరిపోతాయోనన్న భయమే ఎక్కువౌతూ ఉంది. ఈ వయసులో అందరూ వాళ్ల జీవితాల్లో నచ్చిన కొన్ని క్షణాల్ని జ్ఞాపకాలుగా పదిలంగా దాచుకుని, గతాన్ని నెమరు వేసుకోవడం వల్ల సాంత్వన పొందుతారు. పెరుగుతూ వచ్చిన వయస్సుతో పాటే ఎన్నో జ్ఞాపకాలు నా లోపలే జీవిస్తూ ఉన్నాయి. అవి నా నుంచి జారిపోతే? అందుకే గతాన్ని తవ్వుకుంటూ ఊరికొచ్చాను. జీవం ఉన్నంత వరకు నాలోని జ్ఞాపకాలు నాతోనే ఉంటే బావుండనిపించి పెనుగులాడుతున్నాను. లేకుంటే ఇంత చలిలో లేవచ్చా? ఇలా మంచుకురిసే వీథుల్లో నడవొచ్చా? ఇదీ మంచికేనేమో. ఈ రాలి పడిన పారిజాత పూలు నన్ను చుట్టేసి వెనక్కి లాక్కెళ్తున్నాయి. జ్ఞాపకాలను తట్టి లేపుతున్నాయి.

ఆ రోజు గుర్తుంది..
‘ముంబై మెయిలొచ్చే టైమ్‌ అయ్యిందిరా.. మీ నాన్న దిగిపోయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడ్రా’ అని దుప్పటి లాగేస్తూనే చెప్తూ ఉంది అమ్మ. వారాంతాల్లో నాన్న మద్రాసు నుండి వస్తే ఆయన్ని తీసుకురావడానికి సైకిల్‌ వేసుకుని వెళ్లాలి.. అది నా డ్యూటీ. ఎప్పుడూ సరే.. కాని ఈ చలికాలంలో కూడా! ముడుక్కుని పడుకుని గాఢ నిద్రలో ఉన్నాను. అమ్మకు కనికరం లేదు. ఆయన రాలేడా?
గడియారం వైపు చూస్తే నాలుగవుతోంది. చెడ్డ కోపం వచ్చింది. విసురుగా లేచి గోడకి ఆన్చి పెట్టిన సైకిల్‌ని బయటకి తోస్తూ ఉంటే ‘మొహమైనా కడుక్కుని వెళ్లరా’ అంది అమ్మ మళ్లీ.

‘ఈ చలికి  జనాలు సస్తుంటే’ అని కసురుకుంటూ వచ్చేశాను.చలికి గడ్డకట్టుకుపోయినట్టుంది సైకిల్‌. ఎక్కి తొక్కగానే కిర్రుమని ఆగిపోయింది. చలికి కాళ్ల మీదున్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచు కున్నాయి. నోట్లోంచి ముక్కులోంచి సన్నటి పొగ గాల్లో కలిసిపోయింది. జనసంచారం లేక వీథి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ పసిడి వర్ణంలో వెలుగుతున్న వీథి దీపాలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి.‘ఈ టైమ్‌లో మనుషులందరూ హాయిగా ఎంత బాగా నిద్ర పోతుంటారు. నాకేంటి ఈ బాధ’ అని గొణుక్కుంటూ వెళ్తూంటే ఎవరో దూరంగా నేల మీద ఉన్న వాటిని ఏరుకుంటూ బుట్టలో వేసుకుంటున్నారు. 

కొరుక్కుతినే చలిలో నేల మీద ఏరుకోడానికి ఏముంటాయి? పైగా అక్కడ చింతచెట్లు కూడా లేవు అనుకున్నాను మనస్సులో. దగ్గరికి వెళ్లే కొద్ది ఏదో సువాసన ఎటు వైపు నుండి వస్తుందో అర్థం కాలేదు. దగ్గరగా వెళ్లా. ఎవరో అమ్మాయి బుట్ట చేత్తో పట్టుకుని కిందపడిన పారిజాత పువ్వుల్ని ఏరి అందులో వేసుకుంటూ ఉంది. పారిజాతాలకి పరిమళం ఉంటుందా? అది పూలదా.. అమ్మాయి ఒంటిదా? ఇంకాస్త దగ్గరగా వెళ్లా. ఆ అమ్మాయి ముడివేసిన జుట్టులోంచి నీటి బొట్లు పరికిణీ మీదుగా జారిపోతున్నాయి. మొహం సరిగ్గా గమనించలేదు కాని ఎర్రటి ముక్కుపుడక మాత్రం స్పష్టంగా కనిపించింది. అచ్చం పారిజాత పువ్వుకాడ లాగా.

ఆ ఇల్లు దాటగానే సైకిల్‌ ఎక్కి తొక్కడం మొదలు పెట్టి రైల్వేస్టేషన్‌ దగ్గర ఆగి నిలబడ్డాను. నాన్న అప్పటికే ఎప్పటిలాగే బ్రౌన్‌ కలర్‌ షోల్డర్‌ బ్యాగ్‌తో నిలబడి ఉన్నారు. చలికి మఫ్లర్‌ బిగించి ఉన్నారు. తిరిగొచ్చేటప్పుడు ఎప్పటిలానే నాన్న సైకిల్‌ తొక్కుతుంటే వెనుక క్యారేజ్‌ మీద చలిగాలికి ముడుచుకుని కూర్చున్నాను బ్యాగ్‌తో. ఆ పువ్వులున్న చెట్టు దాటుకుని వెళ్తుంటే ఆ అమ్మాయి గుర్తొచ్చింది. ఎప్పుడూ చూడలేదు కాని చూడాలనిపించింది ఎందుకో మరి!

ఆ రోజు తర్వాత అటు వైపుగా ఎప్పుడు వెళ్లినా నా కళ్లు ఆమె కోసం వెతికేవి. ఒకటి కాదు రెండు కాదు వారం రోజులు తిరిగా.. కనిపించనే లేదు. మళ్లీ తెల్లవారుజాము నాన్నని తీసుకుని రావడానికి సైకిల్‌ని తోసుకుంటూ వెళ్తూ ఉంటే పువ్వులు ఏరుకుంటూ కనిపించింది. తల్చుకుంటే ఇప్పటికీ కళ్లలో మెదులుతుంది తన రూపం. ఎరుపు రంగు వోణీ బంగారపు అంచు, తడి ఆరని జుట్టులో చిక్కుకున్న కుంకుడు పలుకులతో మెడ దగ్గర వరకూ వేలాడుతున్న కురులు. కళ్ల దగ్గర చెదిరిన కాటుక. కనుబొమ్మల మధ్య ఎర్రటి సింధూరం.
మళ్లీ ఆ తర్వాత కనిపించలేదు ఎప్పటిలాగానే !

పరమ బద్ధకస్తుడిని నేను. కాని ఆ రోజు నుండి అమ్మాయిని చూడ్డం కోసమే గంట కొట్టినట్టు పొద్దున్నే నాల్గింటికి లేవడం నా దినచర్యలో భాగమైంది. అటు వైపుగా చూస్తూ వెళ్లి వీథి చివర టీ కొట్టు దగ్గర కూర్చోవడం. ఆ అమ్మాయి నన్ను చూసిందో లేదో నా గురించి తెలుసో లేదో కూడా నాకిప్పటికీ తెలీదు. కాని నేనైతే రోజూ చూసేవాడ్ని. ఏ పరిచయం లేని ఆ అమ్మాయి సొంత మనిషిలా అనిపించేది. ఆ అనుభూతి నచ్చింది. అది ప్రేమో కాదో కూడా తెలీదు. ఆ అమ్మాయి గురించిన తలపులతో మనస్సంతా హాయిగా ఉండేది.
పొద్దున్నే గుడిలో తిరుప్పావై మొదలయ్యేది. గోదాదేవి శ్రీరంగనాథుణ్ణే భర్తగా తలచి పెంచుకున్న అపారమైన భక్తి ప్రేమ అందరికీ తెలిసిందే. సాక్షాత్తు శ్రీరంగనాథుడే గోదాదేవి ప్రేమకి లొంగిపోయాడు. సాధారణ మానవులం మనమెంత! కొత్తగా ప్రేమ పుట్టుకు రావడంతో రెక్కలు మొలిచినట్టు అనిపించింది.

ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకున్నా ఆ ఇంటిని చూసినా చాలనిపించి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి తెలుసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కాని అప్పుడు ఉన్న పరిస్థితులకి కనీసం పేరు కూడా తెలుసుకోలేకపోయా. నా వరకు మాత్రం తన పేరు పారిజాతం అనుకున్నా. పారిజాతం.. ఎంత బాగుంది! అసలు పేరు ఏమైనాగానీ ఆ తర్వాత మేము కలిస్తే ప్రేమ ఫలిస్తే ఒక్కటిగా బతికితే ఆజన్మాంతం పారిజాతం అనే పిలుద్దామనుకున్నా. ఈ ఊహలు ఇంకా ఎన్ని సాగేవోకాని ఆ సమయంలో నాన్న మరణం ఒక్కసారిగా కుదిపేసింది. ఇల్లంతా చీకటితో నిండుకుంది.

 నాన్న భుజాల వరకు ఉండేవాణ్ణి.. ఆ వయస్సులోనే బాధ్యతలన్నీ మోయాల్సి వచ్చింది. నా ప్రేమ చెప్పే అవకాశం లేక నాలోనే దాచేశాను. ఊరొదిలి వచ్చేసి పై చదువులు, ఉద్యోగాలు పూర్తయ్యేసరికి ఆ అమ్మాయికిపెళ్లై పోయిందని తెలిసింది. ఒంటరితనం దరి చేరింది. కొన్నాళ్లకి నేనూ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.ఆడవాళ్లు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతారని నా భార్యని చూశాకే అర్థమయ్యింది. సుఖదుఃఖాల్లో నాతోనే ఉంటూ ముందుకు నడిపించింది. కాని నా తొలిరోజుల పారిజాతాన్ని మాత్రం మర్చిపోలేదు. నా ప్రేమ ఒక జ్ఞాపకంలా మిగిలిపోయింది. పిల్లలు, వాళ్ల చదువులు పెళ్లిళ్లు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. వాటితో పాటే భార్య మరణం కూడా. భార్య మరణానంతరం కోలుకోడానికి చాలా సమయం పట్టింది.

మళ్లీ ఏదో తెలియని ఒంటరితనం.. దాంతో పాటుగా చెదిరిపోతున్న జ్ఞాపకాలు.. ఎన్ని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోయినా పారిజాతం జ్ఞాపకం పోకూడదు. జివ్వుమని మరో వరుస చల్లగాలి వీచింది. వర్తమానంలోకి వచ్చిపడ్డాను. అప్పటిలాగే ఇప్పుడూ టీకొట్టు తెరిచి ఉంది.టీ కొట్టు దగ్గరకి వెళ్లాను. పెద్ద బెంచీ ఉండాల్సిన చోట కుర్చీలున్నాయి. పెద్దాయన మనవడు కాబోలు టీ కొట్టు నడిపిస్తున్నాడు. టీతో పాటు ఊరి విషయాలన్నీ చెప్పాడు. దూరంగా గుడిలోంచి తిరుప్పావై పఠనం వినిపిస్తూ ఉంది.

‘ఈ వీథిలో అన్నీ మారిపోయాయి, ఆ పారిజాత చెట్టు’ తప్ప అన్నాను టీకొట్టు అతని వైపు చూస్తూ.‘ఆ ఇంట్లో ఉన్న ముసలావిడ చెట్టుని ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ వస్తుంది సార్‌’ అన్నాడు నవ్వుతూ.మాటల్లోనే ఆ ఇంటి గేట్‌ తెరుచుకుని ఆమె బయటకి వచ్చింది. నెరిసిన జుట్టు, వంగిన శరీరంతో మెల్లగా వచ్చింది. నేల మీద రాలిన పువ్వుల్ని ఏరుకుంటూ ఉంటే నా గుండె గడగడ అదిరిపోయింది. అదే మనిషి. అదే చెట్టు. అవే పూలు. చెదిరిపోతున్న జ్ఞాపకం రివ్వున తిరిగి వచ్చి బలపడి పూర్తిగా స్పష్టమైనట్టు ఉంది నా స్థితి. ఎంతగా అంటే ఇక అలై్జమర్స్‌ నన్ను ఎంత మింగినా ఈ జ్ఞాపకం మాత్రం పోదు.

‘పాపం.. భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. పిల్లలు రమ్మన్నా ఈవిడ ఇల్లు విడిచి వెళ్లదు. ఎవరో పని మనిషి తోడుంది అంతే’ అన్నాడు టీ కొట్టతను.‘ఆవిడ పేరు?’ అడిగాను పూలు ఏరుతున్న ఆమెను చూస్తూ ఉద్వేగంగా.టీకొట్టు అతను కొంచెం సిగ్గు పడుతున్నట్టు తల గోక్కున్నాడు.‘అరే.. ఎప్పుడూ తెలుసుకోలేదు సార్‌’ అన్నాడు.‘పర్లేదు.. నేను కనుక్కుంటాను’ అన్నాను, ఆమెను పలకరించడానికి నిశ్చయించుకుని లేస్తూ. ‘లాభం లేదు సార్‌’ అన్నాడు టీ అతను.‘ఏం?’‘ఆమెకేం గుర్తు లేవు.. ఆ పారిజాతం చెట్టు పారిజాత పూలు తప్ప’అలాగే కుర్చీలో కూచున్నాను.రాలిన పారిజాతాలను ఒక్కొక్కటిగా ఏరుకుని ఆమె మెల్లగా గేటు వేసుకొని లోపలికి వెళ్లిపోయింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement