భారత్, చైనాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల కాంతులీనే పుట్టగొడుగుల్ని కనుగొంది. ఈశాన్య భారత్ లోని వెదురు అడవుల్లో వీటిని గుర్తించారు. రేడియం లాగా చీకట్లో మిరుమిట్లు గొలపడం వీటి ప్రత్యేకత. పుట్టగొడుగుల్లో జీవ వైవిధ్యంపై 2019లో జరిపిన సర్వేలో మొదటిసారిగా ఇవి ‘వెలుగు’ లోకి వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కాంతులు విరజిమ్మే జీవ జాతుల సంఖ్య 97కు చేరిందని నివేదికలు చెబుతున్నాయి.
ఎందుకివి మెరుస్తున్నాయంటే..
ఈ పుట్టగొడుగులు ఇలా మిలమిలా మెరవడానికి కారణం వాటిలో స్రవించే లూసిఫరేజ్ అనే ఎంజైమ్. వాటి జీవక్రియల్లో భాగంగా జరిగే రసాయనిక చర్యల్లో ఎప్పుడైనా శక్తి అధికంగా ఉత్పత్తి అయితే అది ఆకుపచ్చని కాంతి రూపంలో విడుదలవుతుందని పరిశోధకులు వివరించారు. అయితే ఆ కాంతి వాటి కాండం వరకే ఎందుకు పరిమితమైందనేది తమకు సైతం అంతుపట్టని మిస్టరీనే అని వారు పేర్కొన్నారు.
అసలు కారణమిదేనా?
ఫలదీకరణం కోసం మొక్కలు పూల ద్వారా రకరకాల కీటకాలను ఆకర్షిస్తాయనేది తెలిసిందే. ఈ పుట్టగొడుగులు కూడా ఇందుకోసమే కాంతిని వెదజల్లుతున్నాయని ఒక వాదన వినిపిస్తోంది. జంతువులు తమను తినకుండా బెదరగొట్టేందుకే ఇవి ఇలా మెరుస్తుంటాయని కూడా మరో వాదన ప్రచారంలో ఉంది. ఏదేమైనా ఇలా ఆకుపచ్చ రంగులో మెరవడం సాధారణంగా సముద్రజీవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భూమిపై నివసించే ప్రాణుల్లో ఇప్పటివరకూ మిణుగురులు మాత్రమే ఆకుపచ్చ రంగును వెదజల్లుతుండగా, తాజాగా ఆ జాబితాలో ఈ పుట్టగొడుగులు కూడా చోటు దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment