విచారణ సరే.. చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

విచారణ సరే.. చర్యలేవి?

Published Tue, Jun 25 2024 1:16 AM | Last Updated on Tue, Jun 25 2024 1:16 AM

విచారణ సరే.. చర్యలేవి?

కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారా?

ఈ విచారణ నివేదిక సిద్ధం చేసి రెండు వారాలు దాటినా ఇప్పటికి పురోగతి లేకపోవడంతో జరిగిన వాస్తవాల్ని కొత్త కలెక్టర్‌ సత్య శారదాదేవి దృష్టికి తీసుకెళ్లారా.. లేదా? అనే చర్చ జరుగుతోంది. హనుమకొండ బాలల పరిరక్షణ విభాగంలోని లీగల్‌ ప్రొబేషన్‌ అధికారిపై దత్తత దంపతులు బొమ్మిడి నర్సయ్య లిఖిత పూర్వకంగా డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు చేసినా కనీసం విచారణ చేయకుండా ఆ జిల్లా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో అతడిని వెనకేసుకొస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. దత్తత దంపతులకు న్యాయం చేయాలని.. విధుల్ని నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, దీనిపై కలెక్టర్లు సత్య శారదాదేవి, ప్రావీణ్య దృష్టి సారించాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు.

సాక్షి, వరంగల్‌: వరంగల్‌, హనుమకొండ జిల్లా సంక్షేమ విభాగాల తీరు వివాదాస్పదంగా మారుతోంది. దత్తత తీసుకునే దంపతుల నుంచి అడపాదడపా డబ్బులు రాబట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై తూతూ మంత్రంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వరంగల్‌ జిల్లాలోని దత్తత కేసుల విషయంలో హనుమకొండ బాలల పరిరక్షణ విభాగానికి చెందిన లీగల్‌ ప్రొబేషన్‌ అధికారి ఒకరు తల దూర్చారని, దంపతుల నుంచి డబ్బులు వసూలు చేశారని వెలుగులోకి రావడంతో ‘దత్తతలో దందా’ వెనుక మతలబు ఏంటో అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే తనకు పైఅధికారుల అండ ఉందని, ఎవరూ ఎన్ని ఫిర్యాదులిచ్చినా.. కథనాలు రాసినా తనకేం అవ్వదనే ధోరణిని ఆ అధికారి సిబ్బంది ఎదుట ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారిపై చర్యలు తీసుకుంటారా? లేదా అనే అనుమానం సిబ్బందిలో రేకెత్తుతోంది.

ఇబ్బందులు తప్పవా?

వరంగల్‌ కలెక్టర్‌గా పనిచేసి హనుమకొండకు కలెక్టర్‌గా వెళ్లినా ప్రావీణ్యకు దత్తత దందాపై పూర్తి అవగాహన ఉండడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే భయం తప్పు చేసిన వారికి లోలోన ఉన్నప్పటికీ, పైకి మాత్రం అంతా ‘మధు’రంగానే ఉన్నట్టుగా కవరింగ్‌ ఇస్తున్నారని సహ సిబ్బంది చర్చించుకుంటున్నారు. దత్తత దందాపై ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టర్‌ వాకాటి కరుణ కూడా దృష్టి సారించడంతో వీరిని వెనుకేసుకొస్తున్న అధికారులకు కూడా ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. ఇలాంటి కేసుల విషయంలో సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

కానరాని చర్యలు

పిల్లలు లేని దంపతులు పిల్లలు కావాలంటూ చట్ట బద్ధత ప్రకారం దరఖాస్తు చేసుకున్నా.. జిల్లా బాల ల సంరక్షణ దత్తత విభాగాధికారుల తీరుతో ఇబ్బందులు తప్పడం లేదని ‘సాక్షి’లో మే 31, జూన్‌ 8న ‘నిబంధనలు బేఖాతర్‌’, ‘దత్తతలో దందా’ కథనాలు ప్రచురితమయ్యాయి. అనంతరం అప్పటి వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య విచారణకు ఆదేశించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆమె ఆదేశాలతో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ నెల 10న విచారించారు. ఈమేరకు రాయపర్తి మండలానికి చెందిన మురుపోజు రాంబాబు, సవిత, వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బొమ్మిడి నర్సయ్య దంపతుల ఇళ్లకు వెళ్లిన ఈ బృందం వారి దత్తతకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.

సీనియార్టీ కోల్పోయామని ఆవేదన..

వరంగల్‌ జిల్లా బాలల సంరక్షణ విభాగ దత్తత అధికారుల కారణంగానే దత్తతలో ముందు వరుసలో ఉన్న తాము రీవాలిడేషన్‌కు రిక్వెస్ట్‌ పెట్టుకున్నా.. హోమ్‌ స్టడీ చేయకపోవడంతో సీనియార్టీ కోల్పోయామని దత్తత తీసుకునే దంపతులు వాపోతున్నారు. అసలు తమకు పిల్లలే వద్దన్నట్టుగా ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (కారా)కి ఎలా మెయిల్‌ పంపుతారని.. కనీసం తమ ఇంటికి రాకుండానే విచారణ నివేదిక ఎలా సమర్పిస్తారని మురుపోజు రాంబాబు దంపతులు విచారణ బృందం ఎదుట వాపోయారు. అలాగే వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన బొమ్మిడి నర్సయ్య దంపతులు కూడా రీవాలిడేషన్‌ కోసం హనుమకొండ బాలల పరిరక్షణ విభాగానికి చెందిన ఓ అధికారికి రూ.ఆరు వేలు (డీడీ కోసం రూ.రెండు వేలు, ఇతర ఖర్చుల కోసం రూ.నాలుగు వేలు) ఇచ్చామని, నెలలో రెండుసార్లు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఓపెన్‌ చేసి స్టేటస్‌ తెలుసుకునేందుకు వచ్చిన ప్రతిసారి రూ.500 గత మూడున్నరేళ్లుగా ఇస్తూ వస్తున్నామని వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్యకు ఫిర్యాదు చేసినట్టుగా విచారణ బృందానికి వెల్లడించారు.

దత్తత దందాలో అధికారుల ఉదాసీనత

నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై

చర్యలు సున్నా..

కలెక్టర్లు స్పందిస్తేనే ఈ వ్యవహారానికి చెక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement