అంతులేని జాతి వివక్ష.. మూలాలను వెతుక్కుంటూ ఇంటిబాట..ఇక మాకు ఫ్రాన్స్‌ వద్దు..! | French Africans are leaving France | Sakshi
Sakshi News home page

అంతులేని జాతి వివక్ష.. మూలాలను వెతుక్కుంటూ ఇంటిబాట..ఇక మాకు ఫ్రాన్స్‌ వద్దు..!

Published Thu, Oct 31 2024 6:16 AM | Last Updated on Thu, Oct 31 2024 8:21 AM

French Africans are leaving France

ఏకంగా 91 శాతం మందికి తరచూ వివక్ష 

విద్య, ఉద్యోగాలు, అద్దె... అన్నింటా సమస్యలే

అలెక్స్‌ హేలీ ‘రూట్స్‌’. ఆఫ్రికా ఖండంలోని తనవారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లిన ఓ నల్లజాతి అమెరికన్‌ చరిత్ర. ఆ నవల వెనక 12 ఏళ్ల ఎడతెగని అన్వేషణ, అధ్యయనం, పరిశోధన ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లోని నల్లజాతీయులు కూడా అలాగే తమ మూలాలు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. అయితే వారు  వెళ్తున్నది పరిశోధనల కోసం కాదు. కాస్త మెరుగైన భవిష్యత్తు  వేటలో. ఫ్రాన్స్‌లో వారికి ఎదురవుతున్న తీవ్ర జాతి వివక్షే  ఈ వలసలకు ప్రధాన కారణం. ఫ్రెంచివారి మితిమీరిన 
జాతీయవాదాన్ని భరించలేక ఫ్రాన్స్‌ను వీడుతున్న  ఆఫ్రికన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫ్రాన్స్‌లోనే  పుట్టి పెరిగి, జీవితమంతా ఆ దేశంతోనే ముడిపడిందని అనుకున్న ఆఫ్రికన్లు కూడా అన్వేషిస్తూ ఈ జాబితాలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... 

ఫ్రాన్స్‌ను వీడుతున్న నల్లజాతీయుల సంఖ్య బాగా పెరిగింది. ప్రధానంగా సెనెగల్‌ వాసులు ఫ్రాన్స్‌ను వీడి స్వదేశీ బాట పడుతున్నారు. ముస్లిం దేశమైన సెనెగల్‌ పురాతన ఫ్రెంచ్‌ కాలనీ. సెనెగల్‌తో ఫ్రాన్స్‌ సంబంధాలకు మూడు శతాబ్దాల పై చిలుకు చరిత్ర ఉంది. 1960లో సెనెగల్‌కు రాజకీయ స్వాతంత్య్రం వచి్చనా వ్యాపారం, జాతీయ భద్రత, సైనిక ఒప్పందాలు, భాగస్వామ్య సాంస్కృతిక ప్రోత్సాహం తదితరాల రూపంలో ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. సెనెగల్‌ నుంచి వలస వెళ్లిన వారు ఫ్రాన్స్‌లో పలు రంగాల్లో స్థిరపడ్డారు. కానీ ‘ప్రత్యేక సంబంధం’ఇప్పుడు బీటలు వారుతోంది. 

పెరిగిన జాత్యాహంకార నేరాలు 
ఫ్రాన్స్‌లో నల్లజాతీయులపై నిర్వహించిన సర్వేలో ఏకంగా 91 శాతం మంది తాము జాతి వివక్షకు గురైనట్టు చెప్పుకొచ్చారు. 85% మంది చర్మం రంగు ఆధారంగా వివక్షకు గురయ్యారు. ఇది బహిరంగ స్థలాల్లో 41 శాతం, పని ప్రదేశాల్లో 31 శాతముంది. చర్మం రంగు వల్ల ఉద్యోగం నుంచి ప్రమోషన్ల దాకా నల్ల జాతీయులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాపరంగా కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇల్లు కొనడం, అద్దెకు తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు.

 ఒక్క గత ఏడాదిలోనే ఫ్రాన్స్‌లో జాత్యహంకార నేరాలు మూడింట ఒక వంతు పెరిగినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 15,000 పై చిలుకు జాతి, మతాధార నేరాలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో అల్జీరియా సంతతికి చెందిన నహెల్‌ మెర్జౌక్‌ (17) అనే టీనేజర్‌ను పోలీసులు కాలి్చచంపారు. వీటన్నింటి కారణంగా విద్యాధికులైన ఫ్రెంచ్‌ ఆఫ్రికన్‌ ముస్లింలు భారీ సంఖ్యలో నిశ్శబ్దంగా వలస బాట పట్టినట్టు పలు పరిశోధనల్లో తేలింది. అయితే వీరి సంఖ్య ఇదమిత్థంగా తెలియరావడం లేదు. జాతి, మతాధారిత గణాంకాల సేకరణపై ఫ్రాన్స్‌లో నిషేధమే ఇందుకు కారణం.

మా విశ్వాసాలంటే చులకన  
2015లో ఇస్లామిక్‌ ముష్కరులు పారిస్‌లో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. వాటిలో ఏకంగా 130 దుర్మరణం పాలయ్యారు. నాటినుంచీ ఫ్రాన్స్‌లో ఇస్లామోఫోబియా తారస్థాయికి చేరింది. లౌకిక దేశమైన ఫ్రాన్స్‌లో హిజాబ్‌ ధారణ కూడా వివాదాస్పదంగా మారింది. దాన్ని 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వ స్కూళ్లలో నిషేధించారు. ఈ మార్పులు ఆందోళనకరమని కాంగో సంతతికి చెందిన ఆడ్రీ మొంజెంబా అనే టీచర్‌ తెలిపారు. ఆమె రోజూ తన చిన్న కుమార్తెతో కలిసి బస్సు, రైలు మారి స్కూలుకు వెళ్తుంది. అక్కడ బురఖా తీసేసి లోనికి వెళ్లాల్సి వస్తుంది. ఇటీవలే కుటుంబంతో పాటు సెనగల్‌లో స్థిరపడ్డారామె.

 ‘‘ఫ్రాన్స్‌ నాది కాదని అనుకోవడం లేదు. కానీ మా విశ్వాసాలను, విలువలను గౌరవించే వాతావరణంలో నేను, నా పిల్లలు ఎదగాలనేది నా ఆకాంక్ష’’అంటోంది 35 ఏళ్ల మొజెంబా. సెనెగల్‌కు చెందిన 34 ఏళ్ల ఫటౌమాటా సిల్లాదీ ఇలాంటి కథే. ‘‘మా కుటుంబానికి మెరుగైన జీవితం కోసం మా నాన్న ఆఫ్రికా వదిలి ఇక్కడికొచ్చారు. అయితే మూలాలను ఎన్నటికీ మరవొద్దని నిత్యం చెప్పేవారు. ఆ వారసత్వాన్ని నేను మరిచిపోలేదు. అందుకే ఈ వివక్షను భరించే బదులు సెనెగల్‌ తిరిగి వెళ్తున్నా. అక్కడ టూరిజం వ్యాపారం చేసుకుంటా’’అని ఆయన చెప్పుకొచ్చారు. 

వెంటాడుతున్న వివక్ష..  
మెంకా గోమెస్‌దీ ఇదే కథ. వివక్షను తట్టుకోలేక ఫ్రాన్స్‌ను వీడి తమ మూలాలకు తిరిగి వెళ్లాలనుకుంటున్న ఆఫ్రికన్ల కోసం సెనెగల్‌లో ట్రావెల్‌ ఏజెన్సీనే ఏర్పాటు చేశారాయన. ‘‘నేను ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగా. కానీ ఇక్కడ జాత్యహంకారం భరిచలేనంతగా పెరిగింది. ఆరేళ్ల వయసులో స్కూల్లో నన్ను ఎన్‌–వర్డ్‌ అని పిలిచేవారు. నేను ఫ్రెంచివాన్నే అయినా నా తల్లిదండ్రులు ఎక్కడి నుంచో రావడమే ఇందుకు కారణం. ఆ వివక్ష నీడలా వెంటాడుతూనే ఉంది.

 ఇక చాలనిపించింద. ఇ అందుకే కుటుంబాన్ని, స్నేహితులను అందరినీ విడిచి మరీ సెనెగల్‌ వెళ్లిపోతున్న. ఇక నా భవిష్యత్తంతా ఆఫ్రికాలోనే’’అని చెప్పుకొచ్చారు. పుట్టినప్పటి నుంచీ ఫ్రాన్స్‌లోనే గడిపిన ఫాంటా గుయిరాస్సీ కూడా తల్లి జన్మస్థలమైన సెనెగల్‌ వెళ్లే ఆలోచనలో ఉంది. ‘‘కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో రక్షణ లేదు. నా 15 కొడుకు వీధిలో స్నేహితులతో మాట్లాడుతుంటే పోలీసులు అవమానకరంగా తనిఖీ చేశారు. టీవీలో ఎప్పుడు చూసినా మాకు సంబంధించి ఏదో ఒక న్యూస్‌! ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది’’అన్నారామె.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement