న్యూయార్క్: ‘‘ఈ కార్యక్రమ నిర్వహణకు ఆగస్టు 5ను ఎంచుకోవడం కశ్మీరీలపై మరో దురాక్రమణ వంటిది. ప్రజాస్వామ్య భారతాన్ని హతమార్చేందుకు, ద్వేషాన్ని పెంపొందించేందుకు మతాన్ని ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం’’ అని కోలిషన్ అగైనెస్ట్ ఫాసిజం ఇన్ ఇండియా(సీఏఎఫ్‌ఐ- భారత్‌లో ఫాసిజం వ్యతిరేక కూటమి)కి చెందిన అనియా వ్యాఖ్యానించారు. హిందుత్వ శక్తులు, వారిని అనుసరించే ఇండో- అమెరికన్లు అధికార బలంతో రామ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించాయని, ఆ అధికారం ద్వేషాన్ని పెంపొందించడానికి, భారత్‌లోని ముస్లింలు, ఇతరత్రా వర్గాలపై దుందుడుకు చర్యలను మరింతగా ప్రేరేపిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా కోట్లాది మంది ప్రజల కలను సాకారం చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం అంకురార్పణ జరిగిన విషయం విదితమే. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగష్టు 5న ఇందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. (భారత్‌లో లౌకికవాదం ఓడిపోయిన రోజు: ఒవైసీ)
ఈ నేపథ్యంలో ప్రధాని హోదాలో మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కావడాన్ని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రధాని మోదీ చర్య లౌకిక భావనకు విరుద్ధం అంటూ ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య వివాదంలో బీజేపీ, సంఘ్‌పరివార్ సుప్రీంకోర్టుకు అసత్యాలు చెప్పారని ఆరోపించారు. అదే విధంగా బాబ్రీ మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో మందిర నిర్మాణం చేపట్టడం సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో న్యూయార్క్‌లో సైతం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తి కోల్పోయేలా ఆర్టికల్ 370ని రద్దు చేసి సరిగ్గా ఏడాది పూర్తైన నాడే రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పట్ల ఇండియన్ అమెరికన్ ముస్లిం, హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘మనుషుల ప్రాణం కంటే వేడుకలే ముఖ్యమా, కశ్మీరీలకు హక్కులు లేవా, ముస్లింలపై దాడులు ప్రోత్సహించేలా వ్యవహరించారు’’ అంటూ మండిపడుతున్నాయి.(శతాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి)
అదే విధంగా అమెరికన్ ఇండియన్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ రామ మందిర నిర్మాణ భూమి పూజను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించడం పట్ల భగ్గుమంటున్నాయి. ఈ మేరకు ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిందని ది వైర్ నివేదించింది. ఈ మేరకు ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ది కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, పెరియార్ ఇంటర్నేషనల్ యూఎస్‌ఏ వంటి పలు సంస్థలు భారత ప్రధాని చర్యను విమర్శిస్తూ నిరసన తెలిపినట్లు వెల్లడించింది. భారత్‌లో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు తమతో చేతులు కలపాల్సిందిగా కోరడం సహా లౌకిక భావనతో నిండిన భారతే నిజమైన ఇండియా అంటూ వివిధ ప్లకార్డులు ప్రదర్శించినట్లు తెలిపింది.(కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు)
కాగా అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్థలం కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment