ఘనంగా అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
భవానీపురం(విజయవాడపశ్చిమ): అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం పురస్కరించుకుని విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటీస్) ఆధ్వర్యాన శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కస్టమ్స్ ఆర్థిక భద్రత, గ్లోబల్ వాణిజ్య సులభతపై అవలంబించాల్సిన ముఖ్య పాత్రను సూచించింది. ఈ ఏడాది థీమ్ అయిన ‘కస్టమ్స్ – సమర్థత– భద్రత – శ్రేయస్సు’ ను అమలు చేయడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ వేడుకలకు కస్టమ్స్ కమిషనర్ సాదు నరసింహారెడ్డి నేతృత్వం వహించగా ముఖ్యఅతిథిగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ వరిందర్ మెహతా, అతిథిగా డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాదు నరసింహారెడ్డి మాట్లాడుతూ 2024–25లో (జనవరి 2025 వరకు) విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటీస్) ద్వారా రూ.11,480 కోట్లు ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.16.16 కోట్ల విలువైన 20.5 కిలోల బంగారం, రూ.8.3 కోట్ల విలువైన 83 లక్షల సిగరెట్ స్టిక్స్, 10 మెట్రిక్ టన్నుల చైనీస్ వెల్లుల్లి, ఇ సిగరెట్లు, డ్రోన్లు కలిపి రూ.10 లక్షల విలువైన సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ రవాణా చేసిన 16 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. 16.2 మిలియన్ సిగరెట్ స్టిక్స్ (రూ.16.2 కోట్లు), 2.420 కిలోల గంజాయి (రూ2.96 కోట్లు) ధ్వంసం చేశామని తెలిపారు. అధికారులు చేపట్టిన మానవతా కార్యక్రమాలను వివరించారు. వేడుకల్లో భాగంగా గూడూరు సీతామహాలక్ష్మి (ఏపీ బాడీ డోనర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు), వివిధ విభాగాల అధికారులు, వారి కుటుంబాలు, విశేష సేవలు సేవలు అందించిన రిటైర్డ్ అధికారులను సత్కరించారు. ఈ సందర్భంగా 36 మంది ఉద్యోగులు అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసినందుకు సత్కరించారు. కస్టమ్స్ అదనపు కమిషనర్ కాకర్ల ప్రశాంత్ కుమార్ స్వాగత ప్రసంగం చేయగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ విజయవాడ అబ్దుల్ అజీమ్ అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment