ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. ఈ నెల 27న కృష్ణా–గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఇప్పటికే 224 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల (ఏపీవో)కు రెండుదశల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ వి.కరుణ.. జిల్లాల కలెక్టర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులతో శనివారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లను వివరించారు. 112 పోలింగ్ స్టేషన్లకు 112 మంది పీవోలు, 112 మంది ఏపీవోలను నియమించామన్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఇద్దరు చొప్పున ఇతర ప్రిసైడింగ్ అధికారుల (ఓపీవో)ను నియమించినట్లు తెలిపారు. మూడు కేటగిరీలకు సంబంధించి రిజర్వ్ కేటగిరీలో 90 మంది సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఒకరు చొప్పున మొత్తం 112 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. 19 మందిని రిజర్వ్‌లో ఉంచినట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 224 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా రిజర్వ్‌తో కలిపి 324 బాక్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 454 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 24 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (ఎఫ్‌ఎస్‌టీ) విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. 11 చెక్‌పోస్టుల వద్ద రెండు షిఫ్ట్‌ల్లో 22 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్‌ఎస్‌టీ) విధుల్లో ఉన్నాయని, ఏడు వీడియో సర్వైలెన్స్ టీమ్స్ (వీఎస్‌టీ) కూడా పని చేస్తున్నాయన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment