ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రకృతి వ్యవసాయంతో పొందే లాభాలను క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ హాల్లో శనివారం వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం జరుగుతోందని, ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా చూడాలన్నారు. రసాయన పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారిని ఈ వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. దీనికి వ్యవసాయ, ఉద్యానాధికారులతో పాటు సెర్ఫ్ సిబ్బంది మండల, గ్రామ స్థాయిలో రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశాలు నిర్వహించి ఇంటింటికీ తిరిగి వాటి ప్రయోజనాలను వివరించాలన్నారు. రైతులు పచ్చిరొట్ట మాత్రమే కాకుండా పొలంలో నవధాన్యాలు చల్లుకుని నేలను మరింత సారవంతంగా మార్చుకోవచ్చని రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చని రైతులకు వివరించాలన్నారు. సమావేశంలో ప్రకృతి వ్యవసాయ డీపీఎం పార్థసారథి, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ఎన్.పద్మావతి, జె.జ్యోతి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment