ఇక.. గుర్తింపు సులువు | - | Sakshi
Sakshi News home page

ఇక.. గుర్తింపు సులువు

Jun 25 2024 1:32 AM | Updated on Jun 25 2024 1:32 AM

ఇక.. గుర్తింపు సులువు

ఇక.. గుర్తింపు సులువు

హన్మకొండ: శాస్త్ర, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యుత్‌ రంగంలోనూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధునాతన సాంకేతికను వినియోగించుకునేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయి. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా చేసేందుకు నూతన సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే మానవ ప్రమేయం లేకుండానే విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్వహణపై తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ మండలి (టీజీ ఎన్పీడీసీఎల్‌) దృష్టి సారించింది. ప్రస్తుతం ఆపరేటర్లు సబ్‌ స్టేషన్ల నిర్వహణ చూసుకుంటున్నారు. నూతన టెక్నాలజీతో ఆపరేటర్ల అవసరం లేకుండానే 33/11 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్వహణ జరుగనుంది. ఇందులో భాగంగా ముందుగా టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని అన్ని 33/11 కేవీ సబ్‌–స్టేషన్లు, 33/11కేవీ ఫీడర్లును రియల్‌ టైం మానిటరింగ్‌ అండ్‌ కంట్రోలింగ్‌ టెక్నాలజీలోకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ కొత్త టెక్నాలజీతో సబ్‌స్టేషన్‌లో లోడ్‌, పవర్‌ ఫాక్టర్‌, ట్రిప్పింగ్‌లు, బ్రేక్‌ డౌన్‌లు, లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ)లకు సంబంధించిన పూర్తి సమాచారం ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంతోపాటు, సర్కిల్‌, సబ్‌స్టేషన్లలో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగులు ఇచ్చే సమాచారంతో తెలుసుకుంటున్నారు. ఇక నుంచి కార్యాలయాల్లోనే ఎక్కడ అంతరాయం ఏర్పడింది.. సబ్‌ స్టేషన్‌లో లోడ్‌ ఏ మేరకు ఉంది... జరిగిన ట్రిప్పింగ్‌లు, ఎక్కడ బ్రేక్‌ డౌన్‌ అయింది.. వంటి సమస్యలు కార్యాలయాల్లో అధి కారుల ముంగిట కనిపిస్తుంది. దీంతో వెంటనే ఉద్యోగులను అప్రమత్తం చేసి నివారణ చర్యలు చేపట్టొచ్చు. దీంతో పాటు అంతరాయం కలిగిన స్వల్పకాలంలోనే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే అవకాశముంది.

కొత్త విధానం అధ్యయానికి టెక్నికల్‌ టీమ్‌..

ఈ కొత్త విధానాన్ని అధ్యయనం చేయడానికి టెక్నికల్‌ టీమ్‌ను నియమించారు. ఇన్‌చార్జి డైరెక్టర్‌ వి.మోహన్‌ రావు, జీఎం (ఐటీ) జి.శ్రీనివాస్‌, ఆపరేషన్‌ జీఎం కె.గౌతంరెడ్డి, డీఈ (ఐటీ) కె.అనిల్‌ కుమార్‌, స్కాడా ఏడీ శ్రీకాంత్‌తో కూడిన ఈ టెక్నికల్‌ అధికారుల (ఇంజనీర్లు) బృందం ఈ నెల 11, 12 తేదీల్లో ఒడిశాలో టాటా పవర్‌ వెస్ట్రన్‌ ఒడిశా డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌లో అమలు చేస్తున్న తీరు, విధి విధానాలను అధ్యయనం చేసి వచ్చారు.

అధ్యయనంలో పరిశీలించిన విషయాలు..

త్వరితగతిన స్పందించి సమస్యలు పరిష్కరించడం ద్వారా అంతరాయాల సమయం తగ్గించొచ్చు. తద్వారా వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సరఫరా అందించగలగొచ్చు. అంతరాయ సమ యం కనిష్టంగా ఉంటుంది. మెరుగైన సరఫరా– పర్యవేక్షణ ఉంటుంది. మెరుగైన సరఫరా, పర్యవేక్షణ ఫలితంగా పరికరాల జీవితకాలం పెరుగుతుంది. వీటితో పాటు సబ్‌ స్టేషన్‌ ఆటోమేషన్‌ టెక్నాలజీపై గ్రామీణ డిజిటల్‌ సబ్‌ స్టేషన్‌ స్థాయిని పెంచడంపై సాధ్యాసాధ్యాలు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయలు కనిష్ట స్థాయికి తగ్గించి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంపై టెక్నికల్‌ టీం సంపూర్ణంగా అధ్యయనం చేసింది. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకొని వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్‌ సరఫరా అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని యాజమాన్యం తెలిపింది.

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో నూతన టెక్నాలజీ వినియోగం

ముందుగా విద్యుత్‌ అంతరాయం తెలుసుకోవడంపై దృష్టి

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు సబ్‌ స్టేషన్లలో అమలు

ఆ తర్వాత మానవ ప్రమేయం లేకుండా సబ్‌ స్టేషన్ల నిర్వహణ

ఒడిశా వెళ్లి అధ్యయనం చేసివచ్చిన అధికారుల బృందం

టెక్నాలజీ అమలుకు పైలట్‌ ప్రాజెక్ట్‌

ఈ కొత్త రియల్‌ టైం మానిటరింగ్‌ అండ్‌ కంట్రోలింగ్‌ టెక్నాలజీని పైలట్‌ ప్రాజెక్ట్‌ క్రింద ‘స్కోప్‌’, ‘స్కినీదర్‌’ అనే కంపెనీల ద్వారా అమలు చేయనున్నారు. జనగామ సర్కిల్‌ పరిధిలోని చిల్పూరు మండలం చిన్న పెండ్యాల, రఘునాథపల్లి మండలం నిడిగొండ సబ్‌ స్టేషన్‌లలో ఈ కంపెనీలు అవసరమైన రియల్‌ టైం మానిటరింగ్‌ అండ్‌ కంట్రోలింగ్‌ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పనులు జూలై 5 వరకు పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఆదేశించింది. తర్వాత వీటి పని తీరును అధ్యయనం చేసి సత్ఫలితాలను బట్టి ఎన్పీడీసీఎల్‌లోని మిగతా సబ్‌ స్టేషన్‌లో ఈ టెక్నాలజీ అమలుకు టెండర్లు పిలవాలనే ఆలోచనలో యాజమాన్యం ఉంది. తద్వారా మానవరహిత సబ్‌స్టేషన్‌లుగా మార్చే ఆలోచనలో టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం సమాయత్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement