మొగుళ్లపల్లి: చేద బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మహేష్ రాజమొగిలి(40) వ్యవసాయ కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, బంధువు చనిపోతే పరామర్శించడానికి ఆదివారం వేరే గ్రామానికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. రాత్రి సుమారు 11గంటల సమయంలో ఆవరణలోని చేద బావి దగ్గరికి వెళ్లి నీరు తోడుతున్నాడు. ఈ క్రమంలో కాలు జారి బావిలో పడగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కస్తూరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.