కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సెప్టెంబర్ 30న రాత్రి అనూహ్యంగా అనారోగ్యం కారణంగా చైన్నెలోని అపోలో హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే, పూర్తి ఆరోగ్యంతో శుక్రవారం ఆయన ఇంటికి చేరుకున్నారు. రజనీకాంత్ గుండె రక్తనాళంలో వాపు రావడంతో వైద్యులు అత్యవసర విభాగంలో వైద్య చికిత్స నిర్వహించారు. అనంతరం రజనీకాంత్ సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో పలువురు సినీ రాజకీయ నాయకులు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఆందోళనకు గురైన రజనీకాంత్ అభిమానులు తమ అభిమాన నటుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముఖ్యంగా తూత్తుకుడికి చెందిన రజనీకాంత్ అభిమాన సంఘం నిర్వాహకులు ఆలయాల్లోనూ, చర్చిల్లోనూ, పాఠశాలలోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అపోలో వైద్య బృందం తాజాగా మరో హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. దీంతో శుక్రవారం ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జి అయ్యారు. అయితే ఆయన మరో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్ర షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment