పెండింగ్‌ కేసులను పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసులను పరిష్కరించండి

Published Sun, Jun 23 2024 12:46 AM | Last Updated on Sun, Jun 23 2024 12:46 AM

పెండింగ్‌ కేసులను పరిష్కరించండి

నారాయణపేట: ప్రజలు లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని తమ తమ కేసులను రాజీ మార్గం ద్వారా అధిక సంఖ్యలో పరిష్కారం పొందేలా చూడాలని, కోర్టులో ఇదివరకు పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని పోలీస్‌ అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ ఆదేశించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులో జరిగిన కోఆర్డినేషన్‌ మీటింగ్‌లో సెప్టెంబర్‌ 14న జరిగే 3వ జాతీయ లోక్‌ అదాలత్‌ను ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. జూన్‌ 8న జరిగిన లోక్‌ అదాలత్‌లో నిర్దేశించిన కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులను అభినందించారు. సెప్టెంబర్‌ 14 న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించబడునని పోలీస్‌ అధికారులకు తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందన్నారు. ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంతకు ముందు నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో జిల్లాలోని మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల కంటే ఎక్కువ కేసులను పరిష్కరించి మన జిల్లానే ముందు వరుసలో ఉందన్నారు. జిల్లాలోని మొత్తం 14 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెండింగ్‌ ఉన్న సివిల్‌, క్రిమినల్‌ కంపోండబుల్‌, సైబర్‌ క్రైమ్స్‌, హిట్‌ అండ్‌ రన్‌ కేసులను అడిగి తెలుసుకున్నారు.

రాజీమార్గంపై అవగాహన: ఎస్పీ

ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 14న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో జడ్జి ఇచ్చిన టార్గెట్‌ దృష్టిలో పెట్టుకొని 90శాతం వరకు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించాలని పోలీసుఅధికారులకు సూచించారు. ఇంతకు ముందు జరిగిన లోక్‌ అదాలత్‌ లో తమ పోలీసు శాఖ అధికారులు కేసుల పరిష్కారానికి కృషి చేశారని, వచ్చే లోక్‌ అదాలత్‌ లోనూ కేసుల లక్ష్యాన్ని నెరవేర్చేలా తాను పోలీసు అధికారులందరికి తగిన సూచనలు చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ జి శ్రీనివాస్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి మహమ్మద్‌ ఉమర్‌, జకీయా సుల్తానా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఆకుల బాలప్ప, సురేష్‌ కుమార్‌, విజయ భాస్కర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement