ఫేక్‌ కాల్స్‌.. మోసగాళ్లు ముంచేస్తారు | Fake Calls On Private Jobs How To Identify | Sakshi
Sakshi News home page

ఫేక్‌ కాల్స్‌.. మోసగాళ్లు ముంచేస్తారు

Published Sat, Oct 3 2020 8:35 AM | Last Updated on Sat, Oct 3 2020 8:35 AM

Fake Calls On Private Jobs How To Identify - Sakshi

కరోనా కాలంలో కొలువులు కటకట! ఇదే అదనుగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగం కోసం క్యాంపస్‌ సెలక్షన్స్‌కు వెళుతుంటారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో కొలువు దక్కని ఫ్రెషర్స్‌.. మెరుగైన అవకాశాల కోసం సీనియర్స్‌... ఉద్యోగాలు కోల్పోయిన వారు.. జాబ్‌ పోర్టల్స్‌లో తమ వివరాలను అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఇక్కడే టెక్నాలజీని తమకు అనువుగా మార్చుకొని ఉద్యోగార్థులను ముంచుతున్నారు మోసగాళ్లు! జాబ్‌ పోర్టల్స్‌ డేటాబేస్‌ నుంచి అభ్యర్థుల సమాచారం తస్కరించి.. ప్రలోభాలకు గురిచేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జాబ్‌ ఆఫర్‌ మోసాలు గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.

అధికారిక మెయిల్స్‌  
ఉద్యోగాలు కల్పించే సంస్థలు ఏ సమాచారమైనా కంపెనీ అధికారిక ఈమెయిల్‌ నుంచే పంపిస్తాయి. కంపెనీ మెయిల్స్‌ వచ్చినప్పుడు అందులో తమ సంస్థ గురించిన సమాచారం తప్పనిసరిగా పేర్కొంటారు. అందుకు అవసరమైన వెబ్‌సైట్, ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ నంబర్‌తో సహా పొందుపరుస్తారు. అభ్యర్థుల వివరాలను కంపెనీ అధికారిక మెయిల్‌కే పంపాలని కోరతారు. స్కామర్ల నుంచి వచ్చే ఈమెయిల్స్‌ ప్రొఫెషనల్‌గా ఉండవు. అందులో చాలా తప్పులు కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఆఫర్‌ లెటర్‌’ పేరుతో అటాచ్‌మెంట్స్‌ కూడా మెయిల్‌లో వచ్చినట్టయితే.. వాటిని తెరవకపోవడమే ఉత్తమం. ఇలాంటి లింక్స్‌/అటాచ్‌మెంట్స్‌ ద్వారా కంప్యూటర్‌కు హాని కలిగించే మాల్‌వేర్‌ (వైరస్‌) కూడా పంపిస్తారు. టెలిఫోన్‌ నంబర్‌ లేదా కంపెనీ అడ్రస్‌ లాంటి సమాచారం లేకుండా మెయిల్‌ వచ్చిందంటే.. అది పూర్తిగా నకిలీదని గుర్తించాలి.

ఫ్రీ మెయిల్స్‌ 
సంస్థలు ఎప్పుడూ ‘గూగుల్‌.కామ్‌/హాట్‌ మెయిల్‌.కామ్‌’ వంటి ఫ్రీ మెయిల్స్‌ నుంచి ఇంటర్వూ్యలు, ఆఫర్‌ లెటర్స్‌∙పంపించవు. స్కామర్లు చాలా తెలివిగా కంపెనీ రిజిస్టర్‌ ఈమెయిల్‌ ఐడీలను తయారు చేసి.. మరీ మోసాలకు తెరతీస్తున్నారు. కానీ వారు సూక్ష్మమైన మార్పు చేస్తుంటారు. లెటర్స్, స్పెల్లింగ్‌ మార్చడం, ఐఫన్, అండర్‌ స్కోర్‌ వంటి వాటివి అదనంగా జోడించడమో, లేదా ఒరిజినల్‌లో ఉంటే వాటిని తీసివేసి కొత్త మెయిల్‌ ఐడీని సృష్టిస్తారు. వీటిని జాగ్రత్తగా గుర్తించాలి. వచ్చిన మెయిల్‌ను కాపీ–పేస్ట్‌ ద్వారా సెర్చ్‌ చేయాలి.
 
ఆన్‌లైన్‌ చాట్‌ ఇంటర్వ్యూ
మీకు అద్భుతమైన ఉద్యోగ ఆఫర్‌ వచ్చింది. మెసెంజర్‌పై ఇంటర్వూ్యకు హాజరు కావాలని కోరుతుంటారు. వాళ్లు  చెప్పినట్టు చేస్తే అభ్యర్థి వ్యక్తిగత వివరాలను చోరీ చేస్తారు. అందుకోసం స్కామర్లు తరచుగా యాహూ ఐఎం ఖాతాను సెటప్‌ చేయడానికి కొన్ని సూచనలు చేస్తారు. వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఇలాంటి చాట్‌ ఇంటర్వూ్యలు, ఆన్‌లైన్‌లో వివరాలు తీసుకోవని గర్తించాలి. కంపెనీలు సాధారణంగా అభ్యర్థిని ముఖాముఖి ఇంటర్వూ్య చేస్తాయి. మీరు కంపెనీ ఉన్న దేశంలో కాకుండా.. విదేశాల్లో ఉంటేనే స్కైప్‌ వీడియో చాట్‌ ఇంటర్వూ్య నిర్వహిస్తాయి.
 
కంపెనీ వివరాలు తప్పనిసరి 
ఏదైనా కంపెనీ నుంచి ఇంటర్వూ్య ఉందని మెయిల్‌ వచ్చిందంటే.. ముందు ఆ సంస్థ వివరాలు తెలుసుకోవాలి. అది నిజమో కాదో పరిశీలించాలి. అందుకోసం మొదట సదరు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని చూడాలి. కంపెనీ ఎంతకాలంగా పనిచేస్తుందో ఆరా తీయాలి. కొంతమంది స్కామర్లు ఆయా కంపెనీల వెబ్‌సైట్‌లను సృష్టిస్తున్నారు. కానీ కొద్దిగా పరిశోధన చేస్తే అది నిజమైనదో  కాదో ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకోసం మోసపూరిత మెయిల్స్‌పై సమాచారం ఇచ్చే స్కామ్‌వార్నర్స్‌.కామ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక సంస్థ రిజిస్టర్‌ అయి ఏడాది మాత్రమే అయితే అప్రమత్తంగా ఉండాలి.

బ్యాంక్‌ వివరాలు అడిగితే
ఉద్యోగం ఇచ్చే కంపెనీలు ఏవీ అభ్యర్థి బ్యాంక్‌ ఖాతా వివరాలు అడగవు. స్కామర్లు మాత్రం ఈ వివరాలనే అడుగుతారు. ఉద్యోగి వేతనం నేరుగా బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తామని.. పుట్టిన తేదీ వివరాలు, పాన్‌కార్డు, ఆధార్‌ వంటి సమాచారం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒక్కోసారి మీ క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు నింపాలని లింక్‌ పంపిస్తారు. ఈ వివరాలు చెప్పినట్టయితే మన ఖాతాను ఖాళీ చేసేస్తారు. ఆన్‌లైన్‌లోకి వెళ్లే ముందు వెబ్‌సైట్‌ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. వెబ్‌ అడ్రస్‌ ‘http://’ లిస్టెడ్‌ సైట్‌ అయి ఉండాలి. 

ఇంటర్వ్యూ పేరుతో నగదు డిమాండ్‌ 
స్కామర్లు ఇంటర్వూ్య పేరుతో కాల్‌ చేస్తారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఏవేవో ఫీజులు పేరుతో డబ్బులు చెల్లించాలని చెబుతారు. చెప్పిన మొత్తం చెల్లించకుంటే అవకాశం పోతుందని.. కొంత మొత్తమైనా చెల్లించి రిజర్వ్‌ చేసుకోమంటారు. ఇలాంటి మోసాలే ప్రస్తుతం అధికంగా జరుగుతున్నాయి. రిక్రూటర్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు, అప్లికేషన్‌ ఫీజు వంటివి చెల్లించాలంటారు. ఇంటర్వూ్య పూర్తయ్యాక డిపాజిట్‌ సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని చెబుతారు. వాస్తవానికి ఏ కంపెనీ కూడా ఇలాంటి ఫీజులు తీసుకోదని గుర్తించాలి. చాలావరకు కంపెనీలు వ్యక్తిని తమ కార్యాలయానికి రమ్మని ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వూ్య మాత్రమే చేస్తాయి. పేరున్న జాబ్‌ పోర్టల్స్‌ ఉద్యోగ ఆఫర్లను కాల్‌ చేసి చెప్పవు. కేవలం ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్‌ రూపంలోనే సంప్రదిస్తాయి.

భారీ వేతనం ఆఫర్‌
కొత్తగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నప్పుడు ఉద్యోగికి కంపెనీ ఇచ్చే వేతనానికి సంబంధించిన అంశాలు మాత్రమే మెయిల్‌లో పేర్కొంటారు. ఇందులో బీమా, ఇతర సౌకర్యాల గురించి ప్రస్తావించరు. ఫేక్‌జాబ్స్‌ వేతనం కూడా భారీగా ఆశపెట్టే విధంగా ఉంటుంది. అర్హతకు మించి వేతనాలు, అతి ప్రయోజనాలు ఆఫర్‌ చేస్తుంటే.. మోసమని అనుమానించాలి అంటున్నారు నిపుణులు! స్కామర్లు ఉద్యోగ అవసరాలను సరిగా చెప్పరు. వాళ్లు చెప్పే విధులకు, ఉద్యోగానికి ఎలాంటి సంబంధం ఉండదు.

అప్లయ్‌ చేయకున్నా ఆఫర్లు
మీ ఐడీకి చాలా జాబ్‌ ఇంటర్వూ్య మెయిల్స్‌ వస్తుంటాయి. కానీ వాటిలో మీరు దరఖాస్తు చేసింది ఏదీ ఉండదు. అలాంటి వాటికి స్పందించకపోవడమే మేలు.  ఒకవేళ మీరు ఒకటికి మించి సంస్థలకు దరఖాస్తు చేసినట్టయితే.. ఆయా కంపెనీల పేర్లు గుర్తుంచుకోవాలి.  దరఖాస్తు చేయకుండా ఆఫర్‌ వచ్చిందంటే.. అది  మోసం చేసేందుకు స్కామర్లు వేసిన ఎరగా భావించాలి. ఒకవేళ దరఖాస్తు చేసిన సంస్థ నుంచి ఇంటర్వూ్య పేరుతో కాల్స్‌ వస్తే.. సంస్థ గురించి, యజమాని గురించి వివరాలను అడగండి. వారు వివరాలు చెప్పేందుకు సంశయించినట్లయితే అది నకిలీగా భావించాలి!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement