
శ్రీనగర్: కశ్మీర్‌ను భూమ్మీద స్వర్గంలా చూడాలన్నది తన ఆశ అని, అయితే దురదృష్టవశాత్తూ హింస చోటుచేసుకుంటోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. నాలుగు రోజలు పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్ వెళ్లిన ఆయన మంగళవారం కశ్మీర్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘కశ్మీరీయత’లో హింసకు చోటే లేదని, కానీ అది నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కశ్మీర్‌లో కొత్త ఉరవడి సాగుతోందని, గతకాలపు వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యంత పురాతనమైన రుగ్వేద రచన కశ్మీర్‌లోనే జరిగిందని గుర్తు చేశారు.
తత్వశాస్త్రం వర్ధిల్లిన ప్రాంతంగా కశ్మీర్‌ను ఆయన కొనియాడారు. అలాంటి వారసత్వ సంపదను కొనసాగించాల్సిన బాధ్యత కశ్మీర్ యువతపై ఉందని చెప్పారు. దాన్ని కొనసాగించాలంటూ రాష్ట్రపతి యువతను అభ్యర్థించారు. దేశం మొత్తం కశ్మీర్ వైపు గర్వంగా చూస్తోందని, ఇక్కడి యువత సివిల్ సర్వీసెస్ నుంచి వ్యాపారాల వరకు అన్నింటిలోనూ ముందడుగు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతేడాది తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం వల్ల కశ్మీర్ భూలోక స్వర్గంలా మారుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లల్లేశ్వరి రచనల్లో కశ్మీర్ శాంతి భద్రతలకు పెట్టింది పేరని, నాటి పరిస్థితులు మళ్లీ తిరిగి రావాలని కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కశ్మీర్ యూనివర్సిటీ నుంచి గత ఎనిమిదేళ్లలో 2.5లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ పట్టాలను, 1000 మంది డాక్టరేట్లను పొందారని గుర్తు చేస్తూ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment