సమన్వయంతో పనిచేయండి | Mahesh Kumar met Kharge along with his family on Thursday | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయండి

Published Fri, Sep 13 2024 4:29 AM | Last Updated on Fri, Sep 13 2024 4:29 AM

Mahesh Kumar met Kharge along with his family on Thursday

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు ఖర్గే సూచన 

అధ్యక్ష ప్రకటన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన మహేశ్‌ 

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ  

మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మహేశ్‌  

ఉప ఎన్నికలు వస్తే తామూ సిద్ధమేనని వ్యాఖ్య 

సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలోని కార్యకర్త మొదలుకొని సీనియర్‌ నాయకుల వరకు అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సూచించారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన మహేశ్‌ కుమార్‌ గురువారం ఖర్గేను కుటుంబసమేతంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో పార్టీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఖర్గే దిశానిర్దేశం చేశారు.  

స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్‌  
ఖర్గేతో భేటీ అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం వచ్చిన స్థానాలకంటే ఎక్కువ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాహుల్‌ గాం«దీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ప్రజలు నమ్మకంతో తమకు అధికారాన్ని ఇచ్చారని.. అందరం సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు.

అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పార్టీ కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతానని, కొత్త కమిటీలు ఏర్పాటయ్యేంతవరకు పాత కమిటీలు కొనసాగుతాయని తెలిపారు. కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందన్నారు. పీసీసీ కమిటీల్లో 50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని... స్థానిక సంస్థల ఎన్నికలు తమకు ఒక సవాల్‌ అని మహేశ్‌ గౌడ్‌ తెలిపారు. 

అంతేగాక, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ గురించి ముఖ్యమంత్రి, ఏఐసీసీ పెద్దలు మాట్లాడారని... త్వరలో వారే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. 

కేసీఆర్, కేటీఆర్‌ ఎక్కడ? 
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని... ఒకవేళ వచ్చినా ఆ స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలోనే చేరతాయని మహేశ్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సమయం ఇచ్చి0దని... మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్, కేటీఆర్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 

కేటీఆర్‌ సవాళ్లను పట్టించుకునే స్థితిలో లేరని, ప్రజలు బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష పాత్ర ఇస్తే దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించే స్థితిలో లేరని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై నమ్మకం లేకనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు. 

అంతేగాక ఉప ఎన్నికలు రాబోవని... ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని... కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుస్తారని మహేశ్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాగా అరికెపూడి గాంధీ సాంకేతికంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అయినందునే ఆయనకు పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చారని తెలిపారు. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోతున్న పేదలకు సీఎం రేవంత్‌రెడ్డి న్యాయం చేస్తారని మహేశ్‌ గౌడ్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement