బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది... | - | Sakshi
Sakshi News home page

బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది..

Published Mon, Aug 14 2023 12:34 AM | Last Updated on Mon, Aug 14 2023 8:22 AM

- - Sakshi

భువనేశ్వర్‌: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బిజూ జనతాదళ్‌ (బీజేడీ) మధ్య పొత్తు వ్యవహారాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండా స్పష్టంగా తోసిపుచ్చారు. రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆయన ఆదివారం ఈ విషయం వెల్లడించారు. తాజా ఎన్నికల్లో పోటీ కోసం ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య పొత్తు ఉంటుందని వ్యాపించిన ఊహాగానాల పట్ల కేంద్ర మంత్రి ఇలా స్పందించడం విశేషం. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో స్నేహపూర్వకంగా మెలగడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపట్ల ఒకరితో ఒకరు పోటాపోటీగా పొగడ్తలు గుప్పించిన నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీతో బీజేపీ జట్టు కడుతుందనే ఊహాగానాలకు బీజం పడింది. తాజాగా రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండా పొత్తు సమీకరణాల్ని నిరాకరించారు. రాష్ట్రంలో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. రెండు రాజకీయ పార్టీలు ఇప్పట్లో కానీ, సమీప భవిష్యత్తులో కానీ పొత్తు పెట్టుకోబోవని గట్టిగా ఒక్కాణించారు.

గత ఎన్నికల మాదిరిగానే బీజేడీతో ఎటువంటి పొత్తు, మైత్రి, కూటమి లేకుండా బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రామాణికలకు ప్రాణం పోసే దిశలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వేగవంతమైన అభివృద్ధితో దేశ సమగ్రాభివృద్ధికి నిరవధికంగా కృషి చేస్తుందని చెప్పారు. ఈ పాలన తీరు దేశ వ్యాప్తంగా ప్రజల హృదయాల్ని స్పందింప జేసిందన్నారు.

ప్రాంతీయం నుంచి పార్లమెంటు వరకు మోదీ నేతృత్వంలో బీజేపీ విజయానికి ఏమాత్రం ఢోకా ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ కూడా కాషాయ పార్టీ ఒంటరిగా పోటీ చేసి రాష్ట్రంలో పూర్తి ఆధిక్యతతో ఏకై క బలమైన పార్టీగా ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బాహాటంగా సవాలు విసిరారు.

సంస్థాగత వ్యవహారాలు పటిష్టం..
భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాలు పటిష్టత పుంజుకున్నాయి. తాజా రాజకీయ స్థితిగతుల దృష్ట్యా భావి పరిణామాలకు దీటుగా ఈ వ్యవహారాల కార్యాచరణ పూర్తి భిన్నంగా పార్టీ రూపొందించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement