బ్రహ్మపురికి వందేభారత్
భువనేశ్వర్: బ్రహ్మపురి వాసులకు తీపికబురు. అతి త్వరలో 2వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. టాటానగర్, బరంపురం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ట్రయల్ రన్ వంటి ముందస్తు కార్యకలాపాలు పూర్తయినట్లు సమాచారం. అన్నీ కలిసి వస్తే ఈ నెల 15 నుంచే బరంపురం – టాటా మధ్య కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కే అవకాశముంది. రైలు రాకపోకలకు సంబంధించి ప్రతిపాదిత వేళలు, స్టాపేజీల ఆమోదం రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తూర్పు కోస్తా, ఆగ్నేయ రైల్వేని అనుసంధానపరుస్తుంది.
రాష్ట్రంలో ఇది నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కానుంది. ప్రస్తుతం పూరీ – హౌరా, పూరీ – రౌర్కెలా, భువనేశ్వర్ – విశాఖపట్నం మధ్య మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి.
తరణి మాత క్షేత్రానికి రైలు సౌకర్యం..
బరంపురం, టాటా నగర్ మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కెందుఝొరొగొడొ, జోడా, బర్బిల్ ప్రాంతాల గుండా పయనిస్తుంది. ఈ ప్రాంతాల ప్రజలు పొందబోతున్న మొదటి వందే భారత్ రైలు ఇదే అవుతుంది. హరిచందన్‌పూర్ స్టేషన్ మీదుగా ఘొటొగాంవ్‌లో ప్రసిద్ధ తరణి మాత క్షేత్రానికి ప్రజలు సౌకర్యవంతంగా చేరుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ప్రతిపాదిత వేళలు..
● 20891 టాటా నగర్ – బరంపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 5.20 గంటలకు బయల్దేరి మద్యాహ్నం 2.30 గంటలకు బరంపురం గమ్యం చేరనుంది.
● 20892 బరంపురం – టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి రాత్రి 11.55 గంటలకు గమ్యం చేరనుంది.
● టాటానగర్, బరంపురం మధ్య 589 కిలో మీటర్ల దూరం. గంటకు సుమారు 66 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు తీస్తుంది. ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన తొలి రైలు ఇదే కావడం విశేషం.
టాటానగర్–బరంపురం మధ్య సర్వీసు
15 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు
Comments
Please login to add a commentAdd a comment