మంత్రి సురేఖపై మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటు
పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి, టీపీసీసీ చీఫ్‌లకు ఫిర్యాదు
తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ నిరసన
రేవూరి ప్రకాశ్‌రెడ్డితో విభేదాలు ఇప్పటికే బహిర్గతం
సురేఖ భవితవ్యంపై గాందీభవన్ వర్గాల్లో విస్తృత చర్చ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవకుండానే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం వేదికగా పార్టీలో అంతర్గత లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖపై హను మకొండ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం. పరకాల నియోజకవర్గంలో ఇప్పటికే కొండా సురేఖ, ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిల మధ్య విభేదాలు బహిర్గతం కాగా, ఇప్పుడు పార్లమెంటు పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా జత కలిశారు.
మంత్రి సురేఖ తమ నియోజ కవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తమకు నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వీరంతా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం అందజేశారని, తమ నియోజకవర్గాల్లో కలుగజేసుకోకుండా మంత్రి సురేఖను నియంత్రించాలని కోరారని తెలుస్తోంది. దీనికి ముందు మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీని కూడా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
వివాదాస్పదమవుతున్న సురేఖ వ్యవహార శైలి
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి ఇటీవలి కాలంలో వివాదాలకు దారితీస్తోంది. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో వివాదం పార్టీకి తలనొప్పిగా మారింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలతో సైతం సఖ్యత కొరవడటం తాజాగా చర్చనీయాంశమవుతోంది. దీంతో సురేఖ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవలి పరిణామాలు ఆమె భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment