AP: ఈ బడ్జెట్‌ అగమ్యగోచరం: బుగ్గన | Former Minister Buggana Rajendranath Reddy comment On AP Budget 2024 | Sakshi
Sakshi News home page

AP: ఈ బడ్జెట్‌ అగమ్యగోచరం: బుగ్గన

Published Tue, Nov 12 2024 4:52 AM | Last Updated on Tue, Nov 12 2024 5:20 AM

Former Minister Buggana Rajendranath Reddy comment On AP Budget 2024

ఆద్యంతం అబద్ధాలు.. అవాస్తవాలు.. వక్రీకరణలే 

2024–25 బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం 

రూ.41 వేల కోట్లు పెంచినా పథకాలకు నిధులు సున్నా..  మహిళలకు ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి ప్రస్తావనేది

రూ.41 వేల కోట్లు పెంచినా పథకాలకు నిధులు సున్నా 

అన్నదాత సుఖీభవకు కేవలం రూ.1000 కోట్లే..  ఈ ఒక్క పథకానికే రూ.10 వేల కోట్లు కావాలి 

ఆ వెయ్యి కోట్లతో ఎంత మందికి ఇస్తారు?

మహిళలకు ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి ప్రస్తావనేది? 

అమరావతికి రూ.15 వేల కోట్లు గ్రాంటా? లేక రుణమా?  

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచి్చన హామీలన్నీ నెరవేర్చాం

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకుండా, రూ.41 వేల కోట్లు పెంచుతూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రనౌట్‌ అయ్యిందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. తాము 2019 మే 30న ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలన్నరలోనే జూలై 12న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. కోవిడ్‌ వంటి ఇబ్బందులున్నప్పటికీ వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతూ వచ్చామన్నారు. కానీ.. అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ఐదు నెలల సమయం తీసుకున్నారంటూ దెప్పి పొడిచారు.

బడ్జెట్‌ ప్రసంగంలో 21 సార్లు గత ప్రభుత్వమంటూ ప్రస్తావించారని ఎత్తిచూ­పారు. తీరా బడ్జెట్‌ చూస్తే అగమ్యగోచరం అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమ­వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభు­త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో లోపాలు, లొసుగులను ఎత్తిచూపారు. ‘ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రచారం చేశారు. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు అంటూ ప్రచారం చేసి ప్రజలకు ఆశ కల్పించారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వాటి ఊసే లేదు’ అని కడిగి పారేశారు. ఈ సందర్భంగా బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. 

రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం?  
2024–25 వార్షిక బడ్జెట్‌ రూ.2,94,427 కోట్లు కాగా, గత ఏడాది సవరించిన అంచనాల మేరకు బడ్జెట్‌ రూ.2,53,500 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? అందులోనూ ఒక్క దీపం పథకంలో ఒక సిలిండర్‌ మినహా, సూపర్‌ సిక్స్‌ సహా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూపలేదు. అంటే సంక్షేమం లేకున్నా, రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. ఇక అమరావతి పనుల కోసం చూపిన రూ.15 వేల కోట్లు.. గ్రాంటా? లేక అప్పా? అనేది ప్రశ్నార్థకం. 

పన్ను రాబడి రూ.24 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. వాస్తవానికి ఆదాయం తగ్గింది. కాగ్‌ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్నుల ఆదాయంలో దాదాపు 11 శాతం పెరుగుదల నమోదు కాగా, మేలో –2.8 శాతం, జూన్‌ లో –8.9 శాతం, జూలైలో –5.3 శాతం, ఆగస్టులో –1.9 శాతం, సెప్టెంబర్‌ లో –4.5 శాతం.. అలా మొత్తం మీద మైనస్‌ 2 శాతం ఆదాయం నమోదైంది. ఈ నేపథ్యంలో పన్ను రాబడి ఏకంగా రూ.24 వేల కోట్లు ఎలా పెరుగుతుంది? 

ప్రతి ఒక్కరూ ఆలోచించాలి  
  జీఎస్టీ ఆదాయంలో రూ.16 వేల కోట్ల నుంచి రూ.21,500 కోట్ల పెరుగుదల ఎలా సా««ధ్యం? స్టాంప్స్‌–రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా రూ.4 వేల కోట్ల నుంచి రూ.9,500 కోట్లు, సేల్స్‌ ట్యాక్స్‌ పన్ను రూ.8,500 కోట్ల నుంచి రూ.16 వేల కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ రూ.8 వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు, ఇతర పన్నులు రూ.2400 కోట్ల నుంచి రూ.5700 కోట్లు వస్తాయని ఎలా అంచనా వేస్తున్నారు?  
 

 తొలి ఆరు నెలల్లో రాబడి రూ.41,500 కోట్లు అయితే, మిగిలిన ఆరు నెలల్లో రూ.78 వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం? నెట్‌ పబ్లిక్‌ అకౌంట్‌.. అంటే ప్రభుత్వం వద్ద ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డబ్బును రూ.16 వేల కోట్ల నుంచి రూ.1,800 కోట్లకు తగ్గిస్తాం అంటున్నారు. ఆ ప్రకారం ఉద్యోగులకు పెండింగ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ లాంటివి అన్నీ కట్టేయాలి. మరి ఈ ఐదు నెలల్లో ఆ పని చేశారా? 

సూపర్‌ సిక్స్‌ పేరుతో మోసం  
యువగళం కింద యువతకు ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిగా ఇస్తామని హామీ ఇ­చ్చారు. ఆ పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. 
తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. బడ్జెట్‌లో స్పష్టంగా కేటాయింపులు లేవు. బీసీ సంక్షేమంలో రూ.2,400 కోట్లు, ఎకనమిక్‌ వీకర్‌ సెక్షన్‌లో రూ.1160 కోట్లు.. ఇలా అన్ని కలిపి చూపినా తల్లికి వందనం పథకానికి రూ.5,300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. వాస్తవానికి తల్లికి వందనంలో 83 లక్షల మంది పిల్లలకు రూ.12,450 కోట్లు కావాలి. అలాంటప్పు­డు ఇప్పుడు కేటాయించిన మొత్తం ఎంత మందికి సరిపోతుంది? 

అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయింపు కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి చెప్పిన ప్రకారం ఆ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. మిగతా రూ.3500 కోట్లు పీఎం కిసాన్‌ నుంచి వచ్చేది. నిజానికి ఈ పథకంలో అర్హులైన రైతులు 53.53 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,706 కోట్లు కావాలి.   
 దీపం పథకానికి రూ.895 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో 95 లక్షల కుటుంబాలకే ఇవ్వడం వీలవుతుంది. రాష్ట్రంలో 1.42 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన మిగతా వారందరికీ ఇవ్వరా? వాస్తవాలు ఇలా ఉంటే.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి అన్ని పథకాలు అమలు చేసినట్లు ఎలా చెబుతారు? 

ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రూ.37,300 కోట్లు కావాలి. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున 2,07,30,000 మందికి ఇవ్వాలి. దీని ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు.   
 2014 ఎన్నికల్లో కూడా వ్యవసాయ రుణాల మాఫీ, సున్నా వడ్డీ రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, కాపులు, చేనేతలకు సాయం, నిరుద్యోగ భృతి.. ఇలా అన్ని హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు. బా­బు తీరు మొదటి నుంచీ ఇంతే. (బాబు తీరుపై వైఎస్సార్, రోశయ్యలు మాట్లాడిన వీడియో ప్రదర్శించి చూపారు).

మంచి చేస్తే అభాండాలా?  
 విద్యుత్‌ రంగానికి మా హయాంలో 2019–20లో రూ.11,600 కోట్లు, 2020–21లో కోవిడ్‌ ఇబ్బందుల్లో కూడా రూ.6,110 కోట్లు, 2021–22లో రూ.11,500 కోట్లు, 2022–23లో రూ.18,250 కోట్లు, 2023–24లో ఇంచుమించు రూ.15,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.8,100 కోట్లు మాత్రమే ఇచ్చింది.  

 2014–15 నుంచి 2018–19 వరకు ప్రభుత్వం డిస్కంలకు రూ.31,800 కోట్లకు గాను కేవలం రూ.20,165 కోట్లే కట్టింది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.68 వేల కోట్లకుగాను రూ.62 వేల కోట్లు కట్టింది. ఈ లెక్కన ఎవరికి చిత్తశుద్ధి లేదు? 

 వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట ఏనాడూ తప్పలేదు. పథకాల అమలుపై క్యాలెండర్‌ ప్రకటించి, పక్కాగా అమలు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు. గత 5 ఏళ్లలో ఒక్క జగనన్న అమ్మ ఒడికి రూ.26,067 కోట్లు, వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.34,378 కోట్లు, చేయూతకు రూ.19,189 కోట్లు, వైఎస్సార్‌ ఆసరాకు రూ.25,570 కోట్లు అందించాం. ఇలా ప్రతిదీ పక్కాగా అమలు చేశాం.

బడ్జెట్‌ సాక్షిగా అప్పులపై దు్రష్పచారం బట్టబయలు  
 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రాష్ట్ర అప్పులపై అదే పనిగా తీవ్ర దుష్ప్రచారం చేశాయి. రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లని, రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్ధాలు అచ్చేస్తే.. వాటిని పట్టుకుని శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమోనని చంద్రబాబు దు్రష్ఫచారం చేశారు. అప్పులు అడుక్కోవడానికేనా సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్తున్నారని అప్పట్లో పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు అని 2023 అక్టోబర్‌ 25న చెప్పిన పురంధేశ్వరి.. 2024 ఏప్రిల్‌ 7న రాష్ట్ర అప్పులు రూ.12,50,000 కోట్లని ప్రకటించారు. అంటే 5 నెలల్లోనే లక్షన్నర కోట్లు పెంచుతారా?  

 అయితే వాస్తవం ఏమిటన్నది బడ్జెట్‌లో బయట పడింది. రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. 2024 మార్చి 31 నాటికి రూ.4.91 లక్షల కోట్లు, గ్యారంటీ కింద తెచ్చిన అప్పు రూ.1,54,797 కోట్లు.. రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు.    మరి ఆనాడు ప్రచారం చేసినట్లు రూ.14 లక్షల కోట్ల అప్పు ఏది? అంత బాధ్యతా రాహిత్యంగా మాట్లాడతారా? కార్పొరేషన్ల అప్పులతో ప్రభుత్వానికి ఏం సంబంధం? డిస్కంల అప్పులతో ప్రభుత్వానికి ఎలా సంబంధం? పౌర సరఫరాలు, విద్యుత్‌ రంగం.. రూ.34 వేల కోట్లు డబుల్‌ ఎంట్రీ చేశారు. ఔట్‌ స్టాండింగ్‌ డ్యూస్‌ వెండార్స్, స్కీమ్స్‌.. ఎవరికో కట్టవలసినవి రూ.1,13,000 కోట్లు. మరి ఇవన్నీ బడ్జెట్‌లో ఎందుకు చూపలేదు? అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, ప్రజ­లను భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సబబు? 

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి  
   2023–24 బడ్జెట్‌లో రాష్ట్ర అప్పు రూ.4,83,000 కోట్లుగా మేం చూపాం. ఇప్పడు కూటమి ప్రభుత్వ బడ్జెట్‌లో ఆ అప్పును రూ.4,91,000 కోట్లుగా చూపారు. మరి అలాంటప్పుడు ఏకంగా రూ.14 లక్షల కోట్ల అప్పు అని ఎలా దు్రష్పచారం చేశారు? వారం కింద కూడా బడ్జెట్‌ ప్రిపేర్‌ అవుతుందని తెలిసీ.. చంద్రబాబు ఏపీ అప్పుల గురించి దారుణంగా అబద్ధాలు చెప్పారు. ఇందుకు చంద్రబాబు 

ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 
2019–2024 వరకు మేము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో లేకపోయినా, కష్టపడి తిరిగి ఎన్నో సాధించాం. చంద్రబాబు కేంద్రంలో భాగస్వాములై ఏం సాధించారు? అసలు అప్పులు పెంచింది 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. 2014లో రూ.1,32,000 కోట్లుగా ఉన్న అప్పు.. 2019లో ఆయన అధికారం నుంచి దిగిపోయేటప్పటికి రూ.3,31,000 కోట్లు అయింది. అంటే ఐదేళ్లలో ఏటా సగటున 20 శాతం పెరిగింది. 
 వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పు రూ.3,31,000 కోట్లు కాగా, మేము 2024లో దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే ఏటా పెరిగిన అప్పు 14.9 శాతమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలోనే తక్కువ అప్పులు చేశాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement