సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు శుక్రవారం మధ్యాహ్నం కలిశారు. డీజీపీ కార్యాలయంలో తుంగతుర్తి రైతులపై, గురువారం సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడులపై డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపైనా డీజేపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని నేతలు ఆరోపించారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరంపైన దాడి చేయడం టెంట్ పీకి వేయడం వంటి కార్యక్రమాల పైన అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారని డీజేపీకి తెలియజేశారు. రాజకీయ ప్రమేయం జోక్యం వలన ప్రతిపక్ష నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, హింసిస్తున్నారని తెలిపారు. కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొనడం గుర్తుచేశారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. దీనిపై శాంతియుతంగా బీఆర్‌ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. తిరుమలగిరిలో తమ నాయకుడు కిశోర్ ధర్నా చేస్తే.. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కమూకలు దాడి చేశాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో హింస సరికాదని హితవు పలికారు. పోలీసుల సమక్షంలో కిరాయి మూకలు దాడి చేశాయని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారని అన్నారు.
‘పోలీసులు మంత్రుల బర్త్ డేకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైడ్రా పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతల ఫార్మ్ హౌస్‌లను కూల్చాల్సిందే. మంత్రి పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి. మీ ఫార్మ్ హౌస్ కూల్చాలో లేదో రంగనాధ్ డిసైడ్ చేస్తారు. రేపు మహిళా కమీషన్ ముందు హాజరవుతా.
నిన్న ప్రజాస్వామ్యబద్దంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో రైతులు ధర్నా చేస్తుంటే 50 మంది కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. స్థానిక పోలీసు యంత్రాంగంతో కుమ్మక్కు అయ్యి దాడి చేశారు. సుతిల్ బాంబులు వేసి దాడులకు పాల్పడ్డారు. దాడులకు పోలీసులు మద్దతు తెలపడం అంటే రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు పరాకాష్ట.
రుణమాఫీపై రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం..
రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేశారు. కొండారెడ్డిపల్లి నుండి కల్వకుర్తి వరకు మహిళా జర్నలిస్టులను వాళ్ళను వెంబడించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏమీ అన్నారని వాళ్లపై దాడులు చేశారు. రేవంత్ రెడ్డి సిగ్గుంటే ఏ ఊరుకు వస్తావో చెప్పు. నేను వస్తా. రుణమాఫీ ఏ ఊరులో సంపూర్ణంగా జరిగిందో రేవంత్ రెడ్డి చెప్పాలి. సీఎంకు పరిపాలించే సత్తా లేదు. ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment