Maharashtra: Some BJP Leaders Dissatisfied With Eknath Shinde Rebel MLAs - Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర: షిండే  రాక.. కాషాయ నేతల్లో అప్పుడే కలకలం..

Published Fri, Jul 1 2022 2:46 PM | Last Updated on Fri, Jul 1 2022 4:13 PM

Maharashtra: Some BJP Leaders Dissatisfied With Eknath Shinde Rebel MLAs - Sakshi

సాక్షి, ముంబై: శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే, ఆయన వర్గం భవిష్యత్తులో బీజేపీతో జతకట్టడం లేదా బీజేపీలో విలీనం అయ్యే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ముఖ్యంగా థానే జిల్లాలో బీజేపీ వర్గీయుల్లో అసంతృప్తి వాతావరణం నెలకొంది. ముందుముందు ఒకవేళ షిండే వర్గంతో కలిసి బీజేపీ నడవాల్సి వస్తే ఆయన వర్గంలో కొందరు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రి పదవులిచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో ఇంతకాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తమ పరిస్ధితి ఏంటని బీజేపీ వర్గీయులు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.  

థానేకు చెందిన రెబెల్స్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే తనయుడు ఎంపీ శ్రీకాంత్‌ షిందేకు కేబినెట్‌ పదవి లభించే అవకాశముంది. దీంతో థానే జిల్లాకు చెందిన కేంద్ర సహాయ మంత్రి కపిల్‌ పాటిల్‌పై శ్రీకాంత్‌ షిందే పైచేయి సాధించినట్లవుతుంది. దీంతో భవిష్యత్తులో విధాన్‌సభ అభ్యర్థిత్వంపై మీరా–భాయందర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, కల్యాణ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్‌ మద్దతుదారుల్లో అసంతృప్తి నెలకొంది. అధికారం కోసం చేస్తున్న ఈ పోరాటంవల్ల భవిష్యత్తులో థానే జిల్లాకు చీఫ్‌ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొనడం ఖాయమని తెలుస్తోంది.

అప్పట్లో ధర్మవీర్‌ ఆనంద్‌ దిఘే థానే లోక్‌సభ నియోజకవర్గాన్ని బీజేపీ నుంచి కైవసం చేసుకున్న తరువాత థానే జిల్లాపై ఇప్పటికీ శివసేనదే పైచేయి ఉంది. అంతేగాకుండా నియోజక వర్గాల పునర్విభజన తరువాత కూడా థానే, కల్యాణ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన జెండా ఎగురుతూనే ఉంది. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలను తమవైపు లాక్కోవడంలో బీజేపీ విఫలమైంది. కాగా ఎన్సీపీకి చెందిన కపిల్‌ పాటిల్‌కు బీజేపీ తరఫున పోటీ చేసేందుకు అవకాశమిచ్చిన తరువాత భివండీలో బీజేపీ గెలిచింది. అప్పటి నుంచి బీజేపీ బలం పెరిగిపోయింది.

శివసేనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండగా ఎమ్మెల్యే సంజయ్‌ కేల్కర్, ఎమ్మెల్యే రవీంద్ర చవాన్‌లు థానే జిల్లాలో బీజేపీని పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో వీరికి కపిల్‌ పాటిల్‌ బలం కూడా తోడైంది. ఫలితంగా థానే జిల్లాలో మొత్తం 18 ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గుర్తుపై గెలిచివచ్చారు. మిగతా పది మంది ఎమ్మెల్యేలో శివసేన ఐదుగురు, ఎన్సీపీ ఇద్దరు, ఎమ్మెన్నెస్‌ ఒక్కరు, సమాజ్‌వాది పార్టీ ఒక్కరు, ఇండిపెండెంట్‌గా ఒకరు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలలో  నలుగురు ప్రారంభం నుంచి బీజేపీలో ఉన్నవారే ఉన్నారు. ఎంపీ కపిల్‌ పాటిల్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి, ఎమ్మెల్యే నిరంజన్‌ డావ్‌ఖరేలపై థానే సిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తరువాత పార్టీ మరింత పుంజుకోసాగింది. ఇలా ప్రారంభం నుంచి బీజేపీలో కొనసాగుతున్న వారికంటే బయట నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారి ద్వారా పార్టీ బలపడతున్న తరుణంలో ఇప్పుడు షిండే వర్గాన్ని బీజేపీలో చేర్చుకుంటే సీనియర్‌ నేతల పరిస్ధితి ఏంటీ అనే దానిపై చర్చ జరుగుతుంది. 
చదవండి: మహా పాలి‘ట్రిక్స్‌’.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన

కేల్కర్, కథోరే పరిస్థితి ఏంటి? 
సీనియర్‌ ఎమ్మెల్యేలు సంజయ్‌ కేల్కర్, కిషన్‌ కథోరేలకు ఇదివరకు రెండుసార్లు మంత్రి పదవులు దక్కలేదు. కానీ ఇప్పుడు అవకాశం లభిస్తుందా అనే సందేహం వారి మద్దతుదారులను వేధిస్తోంది. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన అనేక అవినీతి కుంభకోణాలను కేల్కర్, డావ్‌ఖరేలు బయటపెట్టి షిండేపై ఆరోపణలు ఎక్కుపెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు షిండే బీజేపీతో జతకడితే పరిస్ధితి మరో విధంగా ఉంటుంది. తప్పనిసరైన పరిస్థితుల్లో కలిపి నడవాల్సి వస్తుంది. ఇది ఆయా నేతలకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే.  

న్యూ ముంబైలో ఎమ్మెల్యేలు గణేశ్‌ నాయిక్, మందా మాత్రేలకు షిండేపై వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారితే నాయిక్‌కు మంత్రిమండలిలో స్ధానం లభిస్తుందా అనే విషయంపై చర్చ జరుగుతుంది. మీరా–భాయందర్‌ కార్పొరేషన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు షిండే వర్గంలోకి చేరుకున్నారు. అందులో ప్రతాప్‌ సర్నాయిక్‌ శివసేనకు చెందినవారు కాగా, మరొకరు బీజేపీ తిరుగుబాటు గీతా జైన్‌ ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. షిండే వర్గంలోకి చేరుకోవడంవల్ల గీతా జైన్‌ మరింత బలపడ్డారు.  

కార్పొరేషన్‌ ఎన్నికల్లో పొత్తు ఉంటుందా? 
ఇదిలాఉండగా భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన అలాగే బీజేపీ, షిండే వర్గం కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయని అంచనా. ఫలితంగా తమతమ వర్గం అభ్యర్థులకు టికెట్‌ ఇవ్వడానికి పోటీ పడే అవకాశముంది. ఇదే పరిస్ధితి థానే, కల్యాణ్, న్యూ ముంబై, ఉల్లాస్‌నగర్, భివండీ తదితర కార్పొరేషన్ల ఎన్నికల్లోనూ ఎదురుకానుంది. ముఖ్యంగా దీని ప్రభావం బీజేపీ కార్యకర్తలపై చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బీజేపీ నేతలతోపాటు ప్రముఖ పదాధికారులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వాతావరణం నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement