ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ వీడినట్లే కనిపిస్తోంది. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే వెనక్కి తగ్గడంతో ముఖ్యమంత్రి పదవి బీజేపీకే దక్కడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని షిండే ప్రకటించడంతో.. ఇక ఫడ్నవీస్ సీఎం అవడం ఖరారైనట్లు సమాచారం.
ఈ క్రమంలో తాజాగా మహాయుతి కూటమిలోని కేబినెట్ కూర్పులోని ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కేబినెట్‌లో గరిష్టంగా 43 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉండగా.. ముఖ్యమంత్రితో సహా మంత్రి మండలిలో సగం శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. దాదాపు 20 మంది మంత్రులకు పదవులు తీసుకునే ఛాన్స్ ఉంది.
ఇక సీఎం పీఠాన్ని వదులుకున్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మూడు కీలక మంత్రిత్వ శాఖలు.. పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, జలవనరులతోపాటు 12 కేబినెట్ బెర్త్‌లను ఇచ్చేందుకు అవకాశం ఉందని సంబంధిత వార్గాలు తెలిపాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి మంత్రివర్గంలో తొమ్మిది శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు శివసేన, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే నేడు(గురువారం) ఢిల్లీలో జరగబోయే మహాయుతి నేతల కీలక సమావేశంలో దీనిపై పూర్తి లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 30న గానీ, వచ్చే నెల 1నగానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment