డెహ్రాడూన్: కాంగ్రెస్ నేతల కుట్రల వల్లే తనపై అత్యాచార ఆరోపణలు వచ్చాయని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి తెలిపారు. కాంగ్రెస్ కుయుక్తులకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సిందర్ భగత్‌కు చెప్పారు. ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని ఎమ్మెల్యే వెల్లడించారు. వివాదాల్లో చిక్కుకున్న మరో ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యే నేగిని పార్టీ అధ్యక్షుడు బన్సిందర్ భగత్ సోమవారం పిలిపించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన వాదనలు బయటికొచ్చాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. కేసు పోలీసుల విచారణలో ఉందని, అది పూర్తయిన తర్వాత దోషిగా తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని బన్సిందర్ భగత్ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇక ఎమ్మెల్యే నేగి అకృత్యంపై కేసు నమోదైనా కూడా ఇంతవరకూ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్‌సింగ్ విమర్శించారు. డీఎన్‌ఏ పరీక్షలు చేయించండని బాధితురాలు చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిష్పాక్షిత దర్యాప్తునకు సిద్ధమని చెప్పిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. హోంమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి సీఎం మర్చిపోయారా అని చురకలంటించారు.
(చదవండి: పోలీసులకు తలనొప్పిగా మారిన కేసు..)
కాగా, ఎమ్మెల్యే నేగి తనపై అత్యాచారం చేశాడని డెహ్రాడూన్ కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2016 నుంచి 2018 మధ్య ఎమ్మెల్యే తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని, పెళ్లి తరువాత కూడా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆయన కారణంగా తనతో భర్త తెగదెంపులు చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే సాన్నిహిత్యంతో తను ఈ ఏడాది మే 18న ఒక బిడ్డకు జన్మనిచ్చానని మహిళ తెలిపారు. నిజానిజాలను తెలుసుకునేందుకు తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై నోరువిప్పకుండా ఉండేందుకు ఎమ్మెల్యే భార్య గతంలో తనకు 25లక్షలు రూపాయలు ఆఫర్ చేశారని కూడా ఆమె ఆరోపించారు.
(చదవండి: నా బిడ్డకు తండ్రి : చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే)
Comments
Please login to add a commentAdd a comment