రావిపాడులో వాగుపారుతుంటే శ్మశాన వాటికకు వెళ్లలేని పరిస్థితి
రైతులు పంట పొలాలకు వెళ్లాలన్నా తప్పని తిప్పలు
వాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్న గ్రామస్తులు
కంభం: ఆ గ్రామంలో వాగు పారుతుంటే ఊరి చివర ఉన్న శ్మశాన వాటికకు వెళ్లాలన్నా, రైతుల పొలాలకు వెళ్లాలన్నా, వ్యవసాయ కూలీలు కూలి పనులకు వెళ్లాలన్నా నానా తిప్పలు పడుతున్నారు. ఎన్నో ఎళ్లుగా ఇబ్బందులు పడుతున్నా ఎవరూ తమ సమస్యను పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. మండలంలోని రావిపాడు గ్రామంలో ఎవరైనా చనిపోతే శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలన్నా నానా తంటాలు పడాల్సి వస్తోంది. కంభం చెరువు నుంచి మార్కాపురం వైపునకు వెళ్లే గుండ్లకమ్మ వాగు రావిపాడు గ్రామం పొలిమేరల్లో నుంచి వెళ్తుంది. చెరువులో నీళ్లు లేని సమయంలో వాగు ఎండి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాటుతుంటారు. చెరువులో నీళ్లు ఉన్న సమయంలో ఈ వాగు ఎప్పుడూ పారుతూనే ఉంటుంది. ఎప్పుడైనా పెద్ద పెద్ద వానలు కురిస్తే వాగు ఇంకా ఉధృతంగా పారుతూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
చచ్చినా చావే:
వాగు అవతల హిందువుల శ్మశాన వాటిక ఉంది. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు శ్మశాన వాటికకు వెళ్లాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. వాగులో నీళ్లు పారుతున్న సమయంలో భుజాల లోతు నీళ్లలో తంటాలు పడుతూ శవాన్ని మోస్తూ వాగు దాటాల్సిన దుస్థితి. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వారి బంధువుల్లో వృద్ధులు, వికలాంగులు ఉంటే అంత్యక్రియలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నా ఎవరూ స్పందించడం లేదు.
రైతులకు తప్పని తిప్పలు:
రావిపాడుతో పాటు పక్కనే ఉన్న కందులాపురం, నడింపల్లి, సైదాపురం, ఔరంగబాదు గ్రామాలకు చెంది రైతులకు గుండ్లకమ్మ అవతల పొలాలు ఉన్నాయి. సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పొలాలు ఉండటంతో రైతులు నిత్యం ఈ మార్గం గుండా పంటపొలాలకు, కూలి పనులకు వెళ్తుంటారు. వాగు పారుతున్న సమయంలో పంటపొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పంటలు పండిన తర్వాత పంటను, ధాన్యాన్ని ఇంటికి చేర్చుకోవాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. మరో మార్గంలో పంటను ఇంటికి చేర్చుకోవాలంటే మూడు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment