అధికారుల మనోధైర్యం దెబ్బతీస్తే ఊరుకోం
● మీ కబ్జాలు.. ఆక్రమణలు బయటపెట్టారనే కలెక్టర్‌పై నిందలు ● చిరువ్యాపారులకు మేం వ్యతిరేకులం కాదు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: అధికారుల మనోధైర్యం దెబ్బతీస్తే ఊరుకోబోమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందనే విషయాన్ని మరిచిపోయి, బీఆర్‌ఎస్ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. ఇందుకు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులే నిదర్శనమని పేర్కొన్నారు. సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్లలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి బీఆర్‌ఎస్ భవన్ కట్టిన ప్రదేశం నుంచే ఐఏఎస్ అధికారిని అనరాని మాటలు అన్న రోజునే తీవ్రంగా ఖండించామన్నారు. రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల సంఘాలు కేటీఆర్ తీరును తప్పుపడుతూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. జిల్లా కలెక్టర్ చట్టాన్ని సంరక్షిస్తే నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జా భూభాగోతాలు బయటకు తీస్తే.. కలెక్టర్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ చేసి జడ్జీలు, సినిమా తారలు, భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నారే.. ఇదేనా మీ సంస్కృతి అని ప్రశ్నించారు.
ఇదేం సంస్కృతి కేటీఆర్..?
ప్రభుత్వ ఉన్నతాధికారులను ట్రోల్ చేయొద్దని మీ కార్యకర్తలకు చెప్పాల్సింది పోయి.. ట్విట్టర్ ట్వీట్స్ చేయడమేనా సంస్కృతి అని కేటీఆర్‌ను నిలదీశారు. కలెక్టర్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీ బొమ్మలతో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన టీస్టాల్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పడం తప్పా.. అని ప్రశ్నించారు. చిరు వ్యాపారులకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ను టార్గెట్ చేస్తూ రోత పుట్టించే రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్, ఆడెపు చంద్రకళ, కుడిక్యాల రవికుమార్, గుండ్లపల్లి గౌతమ్, గోనె శరణ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment