ముంబై: మహిళల టి20 ప్రపంచకప్ వేదిక మార్పు తమ సన్నాహాలపై ప్రభావం చూపదని భారత జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చింది.
ఈ నేపథ్యంలో దీప్తి మాట్లాడుతూ.. ‘టోర్నీ ఎక్కడ జరిగినా అత్యుత్తమ ప్రదర్శన చేయడమే మా లక్ష్యం. వేదిక మార్పు వల్ల సన్నద్ధతపై ఎలాంటి ప్రభావం పడదు. ఐసీసీ ట్రోఫీ కోసం టీమిండియా చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది.
ఈ టోర్నీలో అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నా. యూఏఈలోని పిచ్‌లు ఎలా స్పందిస్తాయనే దానిపై కొంచెం అవగాహన ఉంది. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండాఆటను ఆస్వాదిస్తున్నా’ అని దీప్తి పేర్కొంది.
ఇక ఇటీవల లండన్‌లో జరిగిన హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దీప్తి... సీజన్ ఆసాంతం రాణించింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుదిపోరులోనూ సత్తా చాటిన దీప్తి భారీ సిక్సర్‌తో లండన్ స్పిరిట్ జట్టుకు తొలి హండ్రెడ్ టైటిల్‌ను కట్టబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment