Mahanaryaman: 29 ఏళ్లకే క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ’రాజ కుమారుడు’ | Jyotiraditya Scindia Son 29 Years Old Mahanaryaman Becomes MPCA Chief, More Details Inside | Sakshi
Sakshi News home page

Mahanaryaman: 29 ఏళ్లకే క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ’రాజ కుమారుడు’

Sep 2 2025 10:26 AM | Updated on Sep 2 2025 2:18 PM

Jyotiraditya Scindia Son 29 YO Mahanaryaman becomes MPCA chief

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (MPCA) అధ్యక్షుడిగా మహాన్‌ ఆర్యమన్‌ సింధియా (Mahanaryaman Scindia) ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ‘సింధియా’ రాజ కుటుంబానికి చెందిన 29 ఏళ్ల ఆర్యమన్‌ ఎంపీసీఏ అధ్యక్ష పదవి చేపట్టనున్న అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దివంగత మాధవ్‌రావ్‌ సింధియా మనవడు, ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడైన ఆర్యమన్‌ గత మూడేళ్లుగా క్రికెట్‌ పరిపాలనలో చురుగ్గా పాలుపంచుకుంటున్నాడు. గ్వాలియర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం ఉపాధ్యక్షుడైన ఆర్యమన్‌కు ఎంపీసీఏలో జీవితకాల సభ్యత్వం ఉంది. 

గత ఏడాది కొత్తగా మొదలు పెట్టిన మధ్యప్రదేశ్‌ టి20 లీగ్‌కు ఆర్యమన్‌ అధ్యక్షుడిగా ఉంటూ టోర్నీ నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కాలంగా ఎంపీసీఏలో సింధియాల పట్టు కొనసాగుతోంది. మాధవ్‌రావ్‌ సింధియా తర్వాత ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించగా, ఇప్పుడు మూడో తరానికి చెందిన ఆర్యమన్‌ పదవిలోకి వచ్చాడు. 

ఇక 2010లో మాత్రమే జ్యోతిరాదిత్యను ఓడించేందుకు నాటి రాష్ట్ర మంత్రి కైలాష్‌ విజయ్‌వర్గియ పోటీలో నిలిచినా... చివరకు ఓటమి తప్పలేదు. తొమ్మిదేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో లోధా కమిటీ సిఫారసుల ప్రకారం జ్యోతిరాదిత్య 2017లో ఎంపీసీఏ నుంచి తప్పుకొన్నారు.    

ఇదీ చదవండి:  టీ20 సిరీస్‌ బంగ్లాదేశ్‌ సొంతం 
సిల్హెట్‌: సొంతగడ్డపై నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో బంగ్లాదేశ్‌ గెలుచుకుంది. సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 9 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 17.3 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. 

ఆర్యన్‌ దత్‌ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌), వికమ్ర్‌జిత్‌ సింగ్‌ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. గత మ్యాచ్‌లో రాణించిన తేజ నిడమనూరు (0) ఈసారి తొలి బంతికే వెనుదిరిగాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నసుమ్‌ అహ్మద్‌ (3/21) డచ్‌ టీమ్‌ను దెబ్బ తీయగా... ముస్తఫిజుర్, మహేదీ హసన్‌ చెరో 2 వికెట్లు తీశారు. 

అనంతరం బంగ్లాదేశ్‌ 13.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 104 పరుగులు సాధించింది. పర్వేజ్‌ హుసేన్‌ (23) తొందరగానే వెనుదిరగ్గా... తన్‌జీద్‌ హసన్‌ (40 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ (18 నాటౌట్‌) రెండో వికెట్‌కు 46 బంతుల్లో అభేద్యంగా 64 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మూడో టీ20 ఇదే మైదానంలో బుధవారం జరుగుతుంది.    

చదవండి: షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న మిచెల్‌ స్టార్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement