ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా పిలువబడే అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ సంచలన ప్రకటన చేశాడు. 35 ఏళ్ల మెస్సీ నిన్న తన రిటైర్మెంట్ తేదీని ప్రకటించి ఫుట్‌బాల్ ప్రేమికులకు ఊహించని షాకిచ్చాడు. వచ్చే నెల ఖతర్ వేదికగా జరిగే ప్రపంచకప్ తనకు చివరి అంతర్జాతీయ టోర్నీ అవుతుందని స్పష్టం చేశాడు. కెరీర్‌లో ఇప్పటివరకు నాలుగు వరల్డ్‌కప్ టోర్నీలు ఆడిన మెస్సీ.. తన జట్టును ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు.
ఈ నేపథ్యంలో తన చివరి వరల్డ్‌కప్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మెస్సీ.. అర్జెంటీనాను జగజ్జేతగా నిలబెట్టాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే తన చివరి టోర్నీ బరిలోకి దిగే ముందు ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రపంచకప్ బరిలో నిలిచే జట్లతో పోలిస్తే.. అర్జెంటీనాకు గెలుపు అవకాశాలు కాస్త తక్కువేనని ఇదే సందర్భంగా బాంబు పేల్చాడు. క్లబ్ స్థాయి టోర్నీలతో పోలిస్తే ప్రపంచకప్ మ్యాచ్‌లు చాలా కఠినంగా ఉంటాయని, అందుకే ఎంతటి జట్టునైనా ఫేవరెట్‌గా పరిగణించలేమని అభిప్రాయపడ్డాడు.
కాగా, 1978, 1986 ప్రపంచకప్‌లలో ఛాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా.. ఆతర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చనప్పటికీ ఇటీవలికాలంలో మాత్రం అద్భుతంగా రాణిస్తుంది. గత 35 మ్యాచ్‌ల్లో ఓటమి అన్నదే ఎరుగకుండా వరుస విజయాలతో దూసుకుపోతుంది. 2021 కోపా అమెరికా కప్ ఫైనల్‌లో ఆతిథ్య బ్రెజిల్‌కు షాకిచ్చి ఛాంపియన్‌గా అవతరించినప్పటి నుంచి అర్జెంటీనా విజయయాత్ర కొనసాగుతుంది. వరల్డ్‌కప్ హాట్ ఫేవరెట్లలో ముందు వరుసలో ఉన్న తన జట్టును ఫేవరెట్‌గా పరిగణించలేమని మెస్సీ అభిప్రాయపడటం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే, వచ్చే నెల (నవంబర్) 22న గ్రూప్-సిలో సౌదీ అరేబియాతో పోరుతో అర్జెంటీనా ప్రపంచకప్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఈ జట్టు ఆ తర్వాత మెక్సికో, పోలండ్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment