టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించే క్రమంలో నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా షమీ శ్రమిస్తున్నాడు.
వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత ఈ ఉత్తరప్రదేశ్ ఫాస్ట్‌బౌలర్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఈ ఐసీసీ టోర్నీలో భారత్‌ను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.
అంతేకాదు.. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అత్యంత వేగంగా యాభై వికెట్ల మార్కు అందుకున్న తొలి బౌలర్‌గానూ షమీ రికార్డు సాధించాడు. అయితే, చీలమండ గాయం తీవ్రం కావడంతో ఈ మెగా ఈవెంట్ ముగిసిన వెంటనే శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
ఈ క్రమంలో సుదీర్ఘకాలం పాటు విశ్రాంతి తీసుకున్న షమీ సౌతాఫ్రికా పర్యటనతో పాటు ఐపీఎల్-2024, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలకు దూరమయ్యాడు.
క్రమక్రమంగా కోలుకున్న షమీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ రైటార్మ్ పేసర్ బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు.
కాగా షమీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నాటికి అందుబాటులోకి వస్తాడని భారత నియంత్రణ క్రికెట్ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్ యువ ఆటగాళ్లకే పెద్దపీట వేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్.. యంగ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా జట్టులో కీలకంగా మారాడు.
ముఖ్యంగా ప్రపంచకప్-2024 టోర్నీలో టాప్ వికెట్ టేకర్ల(17)లో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ వైపు గంభీర్ మొగ్గుచూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఇప్పటికే షమీ రీఎంట్రీపై సందేహాలు వ్యక్తం చేశాడు.
గంభీర్ హయాంలో 33 ఏళ్ల షమీ పునరాగమనం చేయాలంటే అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు.. ఫిట్‌నెస్ విషయంలోనూ మరింత దృష్టి సారించకతప్పదని పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ తర్వాత జింబాబ్వేతో టీ20 సిరీస్(4-1)గెలిచిన టీమిండియా తదుపరి జూలై 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment