సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ మెరుపు సెంచరీ బాదిన ఉర్విల్.. తాజాగా మరో సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఉత్తరాఖండ్‌తో ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 36 బంతుల్లో శతకొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్.. 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ తరఫున ఇదే అత్యధిక స్కోర్.
టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ
ఉర్విల్ గత నెలాఖరులో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. భారత్ తరఫున టీ20ల్లో ఇది వేగవంతమైన సెంచరీ. ఓవరాల్‌గా టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన శతకం.
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.
సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీ
పొట్టి ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ..
భారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.
గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!
ఉర్విల్‌ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్‌లో ఉర్విల్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్‌ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. మెగా వేలంలో ఉర్విల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఉర్విల్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. సమర్థ్ (54), ఆధిత్య తారే (54) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో విశాల్ జేస్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు.
183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఉర్విల్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో కేవలం 13.1 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఆర్య దేశాయ్ (23), అక్షర్ పటేల్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో గుజరాత్ ప్రస్తుత ఎడిషన్‌లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో) వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment