తల్లిదండ్రులతో ప్రియ
వేలూరు: తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని నెల్లూరు గ్రామానికి చెందిన ఏలుమలై కూలీ. ఇతని భార్య చినపాప. వీరికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారు. ఆఖరి కుమార్తె ప్రియ. తొమ్మిదేళ్ల క్రితం తల్లిదండ్రులతో బయటకు వెళ్లిన ప్రియ అదృశ్యమైంది. తల్లిదండ్రులు పలు చోట్ల గాలించినా ఎటువంటి ఆచూకీ తెలియరాలేదు. అటవీ ప్రాంతంలో నివశిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆరేళ్ల ప్రియను ఒక మహిళ రాణిపేట జిల్లా షోలింగర్‌లోని ప్రైవేటు ఆశ్రమంలో చేర్పించింది.
ఈ క్రమంలో అధికారులు ఆశ్రమంపై విచారణ జరిపిన సమయంలో ఆశ్రమానికి అనుమతి లేనట్లు తెలియడంతో వేలూరు అల్లాపురంలోని ప్రభుత్వ ఆశ్రమంలో చేర్పించారు. ప్రియకు తన తల్లిదండ్రుల పేర్లు బాగా తెలియడంతో తరచూ తన తల్లిదండ్రులను చూడాలని ఆశ పడేది. మూడేళ్ల క్రితం ఆమె సొంత గ్రామం జ్ఞాపకానికి వచ్చినట్లు ఆశ్రమం మేనేజర్ వద్ద తెలిపింది. దీంతో అధికారులు ప్రియ చెప్పిన నెల్లూరు గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులను విచారణ జరిపి ప్రియ బతికి ఉన్నట్లు తెలపడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.
అనంతరం ప్రియ నిజమైన తల్లిదండ్రులు అవునా కాదా అనే కోణంలో అధికారులు 2021వ సంవత్సరంలో తండ్రి ఏలుమలై, చిన్నపాపకు డీఎన్‌ఎ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ప్రియకు నిజమైన తల్లిదండ్రులని తేలింది. వీటిపై సమగ్రమైన సమాచారాన్ని అధికారులకు అందజేసి సోమవారం సాయంత్రం ప్రియను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ప్రియను కౌగిలించుకుని కన్నీరు మున్నీరయ్యారు. తనను తల్లిదండ్రుల వద్ద చేర్చిన అధికారులకు ప్రియ చేతులు జోడించి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment