లైట్ హౌస్‌పై కొత్త రాడార్
● 100 నుంచి 150 కిలో మీటర్ల దూరం వీక్షించే అవకాశం
సేలం: చైన్నె మెరీనా తీరంలో ఉన్న లైట్‌హౌస్ 11వ అంతస్తుపై కొత్త రాడార్‌ను శనివారం అమర్చారు. దీని ద్వారా సముద్ర మార్గంలో చైన్నెకి వచ్చే, చైన్నె నుంచి వెళ్లే ఓడలు, చేపలు పట్టే పడవలు వంటి వాటిని 100 నుంచి 150 కిలో మీటర్ల దూరం వరకు పరిశీలించవచ్చు. ఈ రాడార్ ఆవిష్కరించే స్కాన్ వివరాలు, ఫొటోలు వెనువెంటనే లైట్‌హౌస్ అధికారులకు, సముద్రతీర భద్రతా పోలీసులకు చేరుతాయి. తద్వారా సముద్ర మార్గంలో తీవ్రవాదులు చొరబడడాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు. ఈ రాడార్ యంత్రం ఇటీవల మరమ్మతులకు గురికావడంతో బెంగళూరు నుంచి కొత్త రాడార్‌ను తీసుకువచ్చి 60 మీటర్ల క్రేన్ సాయంతో సాంకేతిక నిపుణులు శనివారం లైట్‌హౌస్‌పై అమర్చారు.
ఢిల్లీ పర్యటనకు గవర్నర్
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి పదవీ కాలం గత ఏడాది ముగిసిన స్థితిలో పదవి కొనసాగింపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా రెండు రోజుల క్రితం గవర్నర్ రవి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ స్థితిలో ఆయన వేలూరు జిల్లా కాట్బాడిలో పింఛను పొందే మాజీ ఆర్మీ జవాన్లు, వారి కుటుంబీకుల విన్నపాల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అందులో శనివారం ఆర్.ఎన్.రవి పాల్గొన్నారు. ఈ స్థితిలో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా గవర్నర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటనగా అధికారుల సమాచారమిచ్చారు. అయినప్పటికీ ఆయన ఆకస్మాత్తుగా వెళ్లడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈరోడ్ ఉప ఎన్నికలలో
ఒంటరి పోరు
● సీమాన్
సాక్షి, చైన్నె: ఈరోడ్ ఉప ఎన్నికలలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని నామ్ తమిళర్‌కట్చి కన్వీనర్ సీమాన్ ప్రకటించారు. ఈరోడ్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ గత వారం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ స్థానం ఖాళీగా ఉన్నట్టు అసెంబ్లీ కార్యాలయం గెజిట్‌లో ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఉప ఎన్నిక జరగవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి బదులుగా డీఎంకే అభ్యర్థి పోటీలో ఉండవచ్చు అన్న చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే తరఫున గతంలో ఓటమి పాలైన అభ్యర్థి మళ్లీ పోటీలో ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో తాము సైతం పోటీ చేస్తున్నామని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ప్రకటించారు. ఆదివారం ఆయన తిరుచ్చిలో మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నామని, ఒంటరిగానే తమ అభ్యర్థి పోటీలో ఉంటారన్నారు. మైనారిటీలు తమకు ఓట్లు వేస్తారన్న భావనతో వారికి మద్దతుగా తాము వ్యాఖ్యలు చేయడం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ తమకంటూ ఓటు బ్యాంక్ ఉందని, ఆ ఓట్లు తప్పకుండా తమ అభ్యర్థి ఖాతాలో చేరుతాయన్నారు.
రాజస్థానీ తమిళ సేవా
అవార్డులకు శ్రీకారం
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజస్థానీ అసోసియేషన్ ప్రతిష్టాత్మకమైన రాజస్థానీ–తమిళ సేవా అవార్డులను అందించేందుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సమాజ సేవ, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం–సుస్థిరత, పరిశ్రమ రంగంలో కృషి చేస్తున్న వారికి ఈ సేవా అవార్డులను అందించనున్నారు. ప్రతి అవార్డు కింద రూ.2 లక్షలనగదు బహుమతి, ట్రోఫీ, ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తాతీయ తెలిపారు. ఈ మేరకు చైన్నెలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సి. శరవణన్, గౌరవ అతిథిగా ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతిలాల్ జైన్ హాజరయ్యారు. రాజస్థానీ తమిళ సేవా అవార్డుల లోగోను, వెబ్‌సైట్ ఆవిష్కరించారు. రానున్న 2025 మార్చిలో అవార్డులు అందిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హేమంత్ దుగర్, తమిళ సేవా అవార్డుల కమిటీ చైర్మన్ నరేంద్ర శ్రీమల్ అవార్డుల కమిటీ కన్వీనర్ సి.ఎ.అనిల్ ఖిచా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment