ఊడిన పదవి.. అసంతృప్తితో వెనక్కి!
● టీఎన్‌సీసీ ఇన్‌చార్జ్‌కు షాక్ ● అధ్యక్ష మార్పుపై చర్చ
సాక్షి, చైన్నె : తమిళనాడులో పలు కార్యక్రమాలలో హాజరయ్యేందుకు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అజోయ్‌కుమార్‌కు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పదవి నుంచి తప్పించడంతో అసంతృప్తితో ఆయన వెనక్కి వెళ్లి పోయారు. అదే సమయంలో ఆయన పోటోల స్థానంలో కొత్త ఇన్‌చార్జ్ పోటోలతో ఫ్లెక్సీలను ఆగమేఘాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. వివరాలు.. తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా అజోయ్‌కుమార్ వ్యవహరిస్తూ వచ్చారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైతో కలిసి చైన్నె, తూత్తుకుడి, కన్యాకుమారి, తిరునల్వేలిలో రెండురోజుల పర్యటనకు అజోయ్‌కుమార్ సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన శుక్రవారం రాత్రి చైన్నెకు వచ్చారు. విమానాశ్రయంలో పార్టీ నేతలు ఆయనకు ఆహ్వానం పలికారు. అదే సమయంలో పలు రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లను మారుస్తూ ఏఐసీసీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అజోయ్‌కుమార్ పేరు కూడా ఉండడం గమనార్హం. తమిళనాడుకు ఆయన్ని తప్పించి, కొత్తగా గిరీష్ కొడల్కర్‌ను నియమించారు. దీంతో ఉన్న ఇన్‌చార్జ్ పదవి ఊడటంతో షాక్‌కు గురైన అజోయ్‌కుమార్ నేరుగా హోటల్‌కు వెళ్లి పోయారు. రాత్రి హోటల్‌లో బస చేసి శనివారం ఉదయాన్నే విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ వెళ్లి పోయారు. అదే సమయంలో శని, ఆదివారాలలో జరగాల్సిన కార్యక్రమాలకు కాంగ్రెస్ వర్గాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. బ్యానర్లు, ఫ్లెక్సీలలో అజోయ్‌కుమార్ పేరును, ఫొటోను ఏర్పాటు చేశాయి. అయితే ఆయన్ని పదవి నుంచి తప్పించడంతో ఆ ఫొటో స్థానంలో కొత్తగా నియమితులైన గిరీష్ పోటో, పేరు అంటించే పనిలో పడడం గమనార్హం. అయితే, కన్యాకుమారి కులితలైలో కొత్తగా నిర్మించిన కాంగ్రెస్ కార్యాలయంలో శిలాఫలకం అజోయ్‌కుమార్ పేరును పొందు పరిచారు. ఆదివారం ఈ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనున్నది. అయితే, శిలాఫలకంలో పేరు మార్పు కష్టతరం కావడంతో అలాగే ఉంచేయడానికి అక్కడి కాంగ్రెస్ నేతలు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైను తప్పించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. ఆయన రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా పార్టీని , వ్యవహారాలను సాగిస్తున్నట్టు అనేక మంది సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. గత ఏడాది పదవి బాధ్యతలు చేపట్టిన సెల్వ పెరుంతొగైను తప్పించేనా, లేదా కొనసాగించేనా అన్నది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment