తమిళసినిమా: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాది 48 ఏళ్ల సంగీత ప్రయాణం. 1976లో అన్నైకిళి చిత్రం ద్వారా ఈయన సంగీత దర్శకుడుగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత సంగీత కళామతల్లి ఒడిలోనే ఓలలాడుతూ వస్తున్నారు. అలా సుమారు నాలుగున్నర దశాబ్దాల కాలంలో 1,500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అందులో పలు భాషా చిత్రాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ఇళయరాజా అందించిన మధురమైన సినీ గీతాలు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాయి. అలా ఈయనకు ఎన్నో జాతీయ ,రాష్ట్రీయ ఉత్తమ అవార్డులు వరించాయి. కొత్తగా ఇప్పటికీ ఇళయరాజా సంగీతంలో నిత్య కషీవలుడే. ఈయన ఇటీవల లండన్‌లో వెలియంట్ సింఫోని సంగీతాన్ని రూపొందించి మరో అరుదైన రికార్డును సాధించారు. కాగా ఇళయరాజాకు దైవభక్తి మిన్ననే. ఈయన పలు భక్తి గీతాలు సంగీతాన్ని అందించారు అదేవిధంగా ఈయన మూకాంబిక అమ్మవారి భక్తుడు. కర్ణాటక రాష్ట్రం ,ఉడిపి జిల్లాలోని కొల్లూర్‌లో గల మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని ఇళయరాజా తరచూ దర్శించుకుంటారు. ఇది శక్తి పీఠాల్లో మూడవ పీఠం. అక్కడ పార్వతి దేవి ముకాంబిక దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కాగా సింపోనీని సమకూర్చిన సందర్భంగా ఇళయరాజా సోమవారం మూకాంబిక ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ఆలయంలో ఆయన విశేష పూజలు నిర్వహించారు . ముందుగా ఆలయ ధర్మకర్తలు ఇళయరాజాకు ఘన స్వాగతం పలికారు. ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


