విజేతలతో అతిథులు, నిర్వాహకులు
● ఏఐటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి
కొరుక్కుపేట: డాక్టర్ డైట్ ... డాక్టర్ ఎక్సర్‌సైజ్ , డాక్టర్ పాజిటివ్, డాక్టర్ టేకిట్ ఈజీ అనే నాలుగు డాక్టర్లను కలిస్తే ఇక జీవితంలో మరే డాక్టర్ని కలవాల్సిన పనిలేదని ఏఐటీఎఫ్ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సీఎంకే రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చైన్నె పట్టాబిరాంలో ఉన్న డీఆర్‌బీసీసీసీ హిందూ కళాశాల తెలుగుశాఖ తెలుగు భాషా సమితి నిర్వహించిన ఉగాది వేడుకలు, సమాపన సభ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా ఆచార్య సీఎంకే రెడ్డి పాల్గొని విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఉపాధ్యాయ, వైద్య వృత్తులు రెండూ ఉన్నతమైన వృత్తులని, అందులోనూ వైద్య విద్య అంత సులభమైనది కాదని వ్యాఖ్యానించారు. ఘనంగా సాగిన ఉగాది వేడుకలు కార్యక్రమానికి శాఖాధ్యక్షులు డాక్టర్ సురేష్ స్వాగతోపన్యాసం చేయగా, ప్రదాన అధ్యాపకులు డాక్టర్ కల్విక్కరసి ప్రసంగించి ముఖ్యఅతిథినీ సత్కరించారు. కళాశాల రెండు విభాగాల్లో పదవీ విరమణ చేస్తున్న వివిధ శాఖలకు చెందిన నలుగురు అధ్యాపకులను డాక్టర్ సీఎంకే రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపికలను బహూకరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా క్షణ్రోత్తరి, పాటల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిని డాక్టర్ తుమ్మపూడి కల్పన పరిచయం చేయగా, డాక్టర్ ప్రమీల వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా అశ్విని, బాబుల తెలుగుతెల్లి ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. సభా నిర్వహణ తెలుగు విద్యార్థి బాబు, వర్తకశాఖ విద్యార్థి ఝాన్సీ నిర్వహించారు.


